కాంగ్రెస్ పార్టీకి మోక్షం దొరకలేదు. ఆ పార్టీకి ఇందిర కుటుంబమే దిక్కని మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కంటే కుటుంబమే ఎక్కువని మరోసారి రుజువైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మళ్లీ మరోసారి సోనియా గాంధీకే అధ్యక్ష పగ్గాలు కట్టపెట్టింది. పైకి తాత్కాలిక అధ్యక్షరాలు అని ప్రకటించినా… సోనియా గాంధీయో, ఆ కుటుంబంలో మరొకరో తప్ప వేరెవరికీ అధ్యక్ష స్థానం దక్కదని సోమవారం నాటి సమావేశం తేల్చేసింది.
తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సోనియాగాంధీ ప్రకటించగానే పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రకటనకు తోడు కొడుకు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ అధ్యక్ష పదవి తమకు వద్దని, అసలు తమ కుటుంబంలో ఏ ఒక్కరూ ఈ పదవి రేసులో లేరంటూ స్పష్టం చేశారు. ఆ సమయంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాని, సీనియర్ నాయకుడు ఏ.కే.ఆంటోనీ కాని అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చుననే వార్తలు వచ్చాయి. పార్టీలో సీనియర్లు తమను అవమానిస్తారంటూ దీర్ఘాలు పోయారు.
మీడియాకి కావాల్సినంత ఆహారం దొరికింది. కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందంటూ దేశంలోని మిగిలిన పార్టీలు కూడా చాలా ఆసక్తిగా 10, జన్ పథ్ వైపు కళ్లు పరికించాయి. ఆదివారం రాజుకున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ల లేఖల వివాదం సోమవారం సాయంత్రానికి సమసిపోయింది. ఏడు గంటలకు పైగా జరిగిన ఏసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం కొత్తగా ఏం లేదు.
సీనియర్లు, జూనియర్లు అని లేదు. అందరూ ముక్తకంఠం సోనియాగాంధీకి జై కొట్టారు. ఇది ఇలా జరుగుతుందనే ముందే తెలిసిన సోనియా గాంధీ ఏఐసీసీ సమావేశంలో పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని టీవీల్లో స్కోలింగ్ లు చూపించారు. కాగల కార్యం తానే తానే నెరవేర్చుకున్న సోనియాగాంధీ సమావేశంలో మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత.
సోనియా గాంధీకి పార్టీ సాష్టాంగ పడడం కొత్తమీ కాదు. గతంలో రెండు మూడు సార్లు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు “అలుక మానవే చిలుకా” అంటూ దీర్ఘాలు పోయి బతిమిలాడారు. మళ్లీ తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యింది. వంద సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిర కుటుంబ వారసులే దిక్కుగా మారడం ఆ పార్టీ మిగుల్చుకున్న ఘన కీర్తి. సోనియా గాంధీ కొన్నాళ్లు, రాహుల్ గాంధీ కొన్నాళ్లు, అంగీకరిస్తే ప్రియాంక గాంధీ కొన్నాళ్లు అధ్యక్ష స్థానంలో కూర్చుంటారు తప్ప ఎంతటి సీనియర్లు అయినా పార్టీలో వెనుక బెంచీలో కూర్చోవలసిందే. తమను అవమానించారంటూ అలిగిన సీనియర్ నాయకులు కపిల్ సిబాల్, గులాం నబీ అజాద్ వంటి వారు సాయంత్రం లోగా ప్లేటు మార్చేశారు.
కపిల్ సిబాల్ తన ట్వీట్ ని తొలగించారు. గులాం నబీ అజాద్ అయితే గులామమ్యా అంటూ కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. మన్మోహన్ సింగ్ కాని, ఏ.కే. ఆంటోనీ కాని అధ్యక్ష పగ్గాలు చేపడతారనుకుంటే చిత్రంగా మన్మోహనుడే తమ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారు అని ప్రకటించారు. దానికి ఆంటోనీ మద్దతు ముద్ర వేశారు. ఈ మొత్తం పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి సోనియా గాందీ కుటుంబమే దిక్కుగా తేలిపోయింది. ఏడాదికో, ఆరు నెలలకో ఓ సరికొత్త నాటకానికి నాందీ వాచకం పలికి తిరిగి మళ్లీ ఆ కుటుంబం వారే అధ్యక్షులుగా రావడం ఖాయం.











