పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు.. కథల్ని కూడా మన మేకర్స్ కళ్ళు మూసుకొనే కాపీ కొట్టేస్తారేమోనని అనిపిస్తూంటుంది..
భాష అర్ధం కాకపోతేనేం? భావం పట్టిచ్చేస్తుందనే ఆలోచన వారికి ఉండదంటారా? సెన్సేషనల్ హిట్ అయిన ప్రతీ సినిమా కథనూ ఓ కాపీ మజిలీ కథ వెంటాడడం విడ్డూరమే.. మలయాళంలో ఏడేళ్ళ క్రితం సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ ‘దృశ్యం’ సినిమా ఎన్నో భారతీయ భాషల్లో రీమేక్ అయింది. అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా దర్శకుడు జీతు జోసెఫ్ ‘సస్పెక్ట్ ఎక్స్’ అనే జపనీస్ సినిమా నుంచి ఎత్తేశాడని అప్పట్లో చాలా అభియోగాలొచ్చాయ. ఇదే సినిమా తెలుగులో అదే పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ అయింది. తమిళంలో కమల్ హాసన్ హీరోగా ‘పాపనాశనం’ అనే పేరుతో తెరకెక్కింది. తమిళంలో కూడా ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఇక కన్నడలో ‘దృశ్య’ అనే పేరుతో రూపుదిద్దుకుంది.

అక్కడ కూడా ఈ మంచి విజయం సాధించింది. అలాగే హిందీలో కూడా అజయ్ దేవగన్, శ్రీయ ముఖ్యపాత్రలో ఈ సినిమా ‘దృశ్యం’ అనే పేరుతోనే రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇన్ని భాషల్లో ఇంతగా ఘన విజయం సాధించిన ఈ సినిమాపై అప్పట్లో చాలా వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా జపనీస్ సినిమాకి ఫ్రీమేకని, అది ఒరిజినల్ ఆలోచన కాదని మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విమర్శలు తలెత్తాయి. హిందీ నిర్మాత ఏక్తా కపూర్ ఒకడుగు ముందుకేసి ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ జోసఫ్ కు లీగల్ నోటీసు కూడా పంపింది. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ‘దృశ్యం’ సినిమా జపనీస్ సినిమా ‘సస్పెక్ట్ ఎక్స్’ అనే సినిమా ఆధారంగా తీశారని ప్రచారం మొదలైంది. ‘దృశ్యం’ సినిమాకు, ‘సస్పెక్ట్ ఎక్స్’ సినిమాకు ఒక పోలిక ఉంది. తల్లీకూతుర్లు కలిసి ఒక వ్యక్తిని చంపడం. ఆ ఒక్క పోలిక తప్ప ఇంకా ఏమాత్రం ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక లేదు. రానురాను ఈ పుకార్లు ఎక్కువ అయ్యాయి. దింతో ఏక్తా కపూర్ ఇచ్చిన లీగల్ నోటీస్ కు డైరెక్టర్ జోసఫ్ వివరణ ఇచ్చాడు.

రెండు సినిమాల మధ్య పోలిక ఉండడం నిజమే కాని నేను సినిమా తీసే సమయానికి ఆ సినిమా గురించి వినలేదు, చూడలేదు కూడా అని చెప్పాడు. మీరు నోటీస్ ఇచ్చిన తర్వాతే ఆ సినిమా చూసానని అన్నాడు కూడా. దాంతో ఏక్తా కపూర్ ఇచ్చిన లీగల్ నోటీస్ నిలపడలేదు. అదే సమయంలో సతీష్ పాల్ అనే మలయాళ రైటర్ కూడా దర్శకుడు జోసఫ్ పై కోర్టులో కేసు వేశాడు. తను రాసిన కథలాంటిదే ‘దృశ్యం’ సినిమాగా తీసారని అందువలన తనకు న్యాయం చేయాలని కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు జోసఫ్ ను 10లక్షలు డిపాజిట్ చేయమని ఆదేశించింది. అయితే కోర్టులో సతీష్ వాదన నిలపడలేదు. ఎందుకంటే దర్శకుడు జోసఫ్ 2011లోనే ఈ కథను రాసుకున్నటు తగిన ఆధారాలు ఉండడం వలన ఈ కేసును కోర్టు కొట్టేసింది. అలాగే చైనీస్ వాళ్ళు ఒక భారతీయ సినిమా రైట్స్ కొని సినిమా తీయడమనేది ‘దృశ్యం’ తోనే జరిగింది. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకొని ‘దృశ్యం’ సినిమా ప్రేక్షకులను రంజింపచేసింది.
-ప్రసాద్ తోట











