దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో.. కరోనా కట్టడి అవుతుందని.. ఇకపై పూర్తి స్ధాయిలో తగ్గుతుందని అందరూ భావించారు. ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాలలో కట్టడిలో ఉన్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలలో మాత్రం కరోనా మహమ్మారి తిరిగి పురులువిప్పుతోంది. ప్రస్తుతం ఇదే ఆరోగ్య నిపుణుల్ని కలవరపెడుతుంది. ఇది ఆ రాష్ట్రాలతో ఆగితే సరే.. మళ్లీ దేశమంతా విస్తరిస్తుందని భయపడుతున్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాలలో కరోనా విజృభిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు..
గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 75 శాతం పైగా ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతుండడం కలవరపెడుతుంది. వీటితో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోనూ రోజువారీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది.
సున్నా మరణాలు..
ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సున్నాగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణ, హరియాణా, జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం, చండీగఢ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, లద్దాఖ్, మిజోరం, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ- దయ్యూదామన్‌లలో 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదకాలేదని తెలిపింది.
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం
కరోనా విజృభిస్తున్న ఐదు రాష్ట్రాలలో.. ముఖ్యంగా మహారాష్ట్ర పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కేసులు తగ్గుతున్నాయనుకున్న నేపథ్యంలో.. ఒక్కరోజులో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతుంది. దాదాపు మూడు నెలలుగా ఇన్ని కేసులు ఒక్కరోజులో నమోదు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చివరిగా అక్టోబరు లో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అన్ని కేసులు వెలుగుచూశాయిని ప్రభుత్వం తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కి చేరింది. 44 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,713కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి.