మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ కూడా సూపర్ హిట్ అవడంతో ఆ చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన రీమేక్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలుగు ఇంతకుముందు మాదిరిగా అదే కాంబినేషన్ లో రీమేక్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్టుగా విడుదలైంది. అయినా ఈ సినిమాకు మంచి రిపోర్టులు వచ్చాయి. జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన కుర్రాడిని చంపి దొరకకుండా తప్పించుకుంటుంది వెంకటేష్ కుటుంబం. ఆ శవం పోలీస్ స్టేషన్ భవంతి కింద ఉన్న సంగతి ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అక్కడితో ఆ చిత్రం ముగిసిపోయింది. ఈ రెండో భాగంలో ఆ శవాన్ని బయటికి తీయడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహాలకు సమాధానం వచ్చేసింది. వెంకటేష్ ఈ సినిమాను చేయబోతున్నట్టు అధికారికంగానే వార్తలు వచ్చేశాయి. తెలుగులో మొదటి భాగానికి సినీ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించింది. అయినా ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అయితే ఈసారి తెలుగులో కూడా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. వెంకీ, సురేష్ బాబులతో జీతూ జోసెఫ్ కలిసిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తయింది. అలాగే ఎఫ్ 3 కూడా సెట్స్ పైన ఉంది. మలయాళ సినిమాని 46 రోజుల్లో పూర్తి చేసిన జీతూ తెలుగులో కూడా అంతే వేగంగా సినిమాని పూర్తిచేస్తాడని భావిస్తున్నారు. ఎఫ్ 3 కన్నా ముందే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.