మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, గుజరాత్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఇప్పటికే అనేక చర్యలకు దిగాయి. అయినా కరోనా సెకండ్ వేవ్ ఉదృతిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. గత ఏడాది కరోనాను అడ్డుకునేందుకు మూడు నెలలపాటు లాక్ డౌన్ కొనసాగించాల్సి వచ్చింది. దీంతో కోట్లాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. మరలా అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రధాని మోడీ రాష్ట్రాలకు విజ్ఙప్తి చేశారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే లాక్ డౌన్ ను వెళ్లాలని సూచించారు.
18ఏళ్లు దాటిన వారందరికీ టీకా
దేశంలో ఇప్పటికే 12 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. ప్రంట్ లైన్ వారియర్స్ తో పాటు 45 సంవత్సరాలు దాటిన వారికి ఈ నెలాఖరు వరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన టీకాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ప్రధాని మోదీ కంపెనీలను ఆదేశించారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకాను కూడా వచ్చే నెల నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్దమైంది. ప్రతి నెలా 10 కోట్ల టీకాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో దేశంలో అందరికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా ఉండటంతో ట్రేస్, టెస్ట్, ట్రీట్ మెంట్ విధానంతోపాటు, టీకాలను పెద్ద ఎత్తున వేయాలని నిర్ణయించారు. ముందుగా దేశంలో 30 కోట్ల మందికి టీకాలు వేస్తే కరోనా ఆరు వారాల్లో అదుపులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో కల్లోలం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ ఢిల్లీలోనే 50 వేల మంది కరోనా భారినపడుతున్నారు. దీంతో దేశ రాజధానిలో ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాత్రి కర్ఫ్యూను విధించారు. విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు రద్దయ్యాయి. ఇక సోషల్ డిస్టెన్స్ తో పాటు, మాస్క్ తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా భారిన పడ్డారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా ఢిల్లీలో నిమిషానికి 20 మంది కరోనా భారిన పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ కోరలు…
మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రోజూ లక్ష మందికిపైగా కోవిడ్ భారిన పడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వారాలు లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇదే బాటలో మిగిలిన రాష్ట్రాలు కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసర సేవలతోపాటు పరిశ్రమల ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూస్తున్నారు. ఇక ఐటీ సేవలకు అంతరాయం కలగకుండా వారికి పాసులు మంజూరు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వేలాది మంది కూలీలు ఇప్పటికే పలు రాష్ట్రాలకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లోనూ కోవిడ్ కోరలు చాస్తోంది. మహారాష్ట్ర ప్రభావంతో తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
తెలంగాణ,ఏపీలో కట్టడి చర్యలు
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూ విధించారు. తెలంగాణలో రోజుకు 9 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా కరోనా భారిన పడ్డారు. సీఎం ఆరోగ్యాన్ని వైద్య నిపుణల బృందం పర్యవేక్షిస్తోంది. ఇక కరోనా కట్టడికి వ్యాపారసంస్థలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకే వ్యాపార, వాణిజ్యాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మెట్రో సేవల్లోనూ మార్పులు చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అనేక ప్రభుత్వ ఆసుపత్రులను కరోనా ట్రీట్ మెంటు కేంద్రాలుగా మార్చారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు కరోనా సేవలు అందిస్తున్నా, అక్కడ దోపిడీకి జనం భయపడుతున్నారు. రెమీడిసీవర్ ఇంజెక్షన్ దొరక్క రోగుల బంధువులు అవస్థలు పడుతున్నారు. రూ.2500కు అమ్మాల్సిన ఈ ఇంజెక్షన్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 40 వేలకు విక్రయిస్తూ మెడికల్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది.
ఏపీలో రాత్రి కర్ఫ్యూ
ఏపీలో నిన్న ఒక్క రోజే 8,500 మంది కరోనా భారినపడ్డారు. 25 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో అక్కడ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే విద్యా సంస్థలను వచ్చే నెల 9 వరకు సెలవులు ప్రకటించారు. అయితే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, అనేక ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా ట్రీట్ మెంటు సెంటర్లుగా మార్చారు.
Must Read ;- మూడు రోజుల్లో ముగ్గురి మృతి.. ఏపీ సెక్రటేరియట్‌లో కరోనా కలకలం