(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి
ఉత్తరాంధ్రను కరోనా భయపెడుతోంది. ఒకప్పుడు గ్రీన్ జోన్‌గా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా ఇప్పుడు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వీయ లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది. మూడు నెలల పాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ రూపంలో ఏపీ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు ఇప్పుడు రెట్టింపు వేగంగా విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.
దారుణంగా ..
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖ మినహా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు గ్రీన్ జోన్‌లుగా ఉండేవి. ఇప్పుడు రెండు జిల్లాల్లో కేసులు ఊహించని విధంగా రెట్టింపు అవుతున్నాయి. ప్రతి రోజు కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండు వందలు పైనే ఉంటోంది. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించుకుంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సొంత ఇలాకా.. కురపాంలో వ్యాపారులు స్వచ్ఛంద లాక్ డౌన్‌కు పిలుపు ఇచ్చారు. సోమవారం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని నిర్ణయించారు. ప్రతి షాపులో కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కు పెట్టుకున్న వారికే సరుకులు విక్రయించాలని.. భౌతిక దూరం పాటించేలా చేయాలని నిర్ణయించారు. పరిస్థితిని బట్టి షాపులు పూర్తిగా మూసివేయాలా? నిర్ణీత సమయాన్ని పెంచాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా కేసులు భారీగా పెరిగాయని. ఇంకా ప్రబలకుండా తమ వంతుగా సంఘం తరఫున స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతామన్నారు. షాపులకు వచ్చే కొనుగోలుదారులంతా మాస్కులు ధరించి వస్తేనే నిత్యావసర సరుకులు ఇస్తామని, కొనుగోలు దారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వ్యాపార సంఘాలు పిలుపు ఇచ్చిన ఈ లాక్‌డౌన్‌కు కళాసీ సంఘం తరఫున మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు జి.సర్వేశ్వరరావు స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక ప్రజలు సైతం వ్యాపార సంఘాల నిర్ణయాన్ని సమర్థించారు. విజయనగరంలోనూ ఈ నెల 22నుండి పాక్షిక లాక్ డౌన్ పాటించేందుకు వర్తక సంఘాలు నిర్ణయించాయి. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ మేరకు కలెక్టర్‌కు కలిసి విన్నవించారు. కరోనా మొదటి దశలో ఎంతో మంది వర్తకులు కోవిడ్ బారిన పడి ఆర్ధికంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయారు. అంతేకాక ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కుకును కోల్పోయాయి. అయితే ఈ సెకెండ్ వేవ్ మరింత ప్రమాదమని చెబుతున్న నేపథ్యంలో.. ఇబ్బందులను అధిగమించటానికి వర్తక సంఘాలు లు ఈ నిర్ణయం తీసున్నట్లు చెపుతున్నాయి. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్
లాక్ డౌన్ దిశగా విద్యాసంస్థలు
ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో పలు విద్యా సంస్థలు కూడా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించకపోయినా.. ఇప్పటికే చాలా వరకు స్కూళ్లు, కాలేజీల్లో సిబ్బంది, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఎక్కువ కేసులు నమోదైన విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందగా కొన్ని రోజులు మూసేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి.
టీడీపీ జిల్లా కార్యాలయానికి లాక్ డౌన్
టీడీపీ విజయనగరం కేంద్ర కార్యాలయానికి సోమవారం లాక్‌డౌన్ ప్రకటించి తాళం వేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొవిడ్‌పై జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని వారు సూచించారు. తమను సెల్ ఫోన్ల ద్వారా మాత్రమే సంప్రదించాలని కోరారు.
కార్పొరేషన్ కార్యాలయంలో కలకలం
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖలో నలుగురు ఉద్యోగులకు కరోనా రావడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కార్యాలయానికి రావల్సిన ఉద్యోగులలో చాలామంది గైర్హాజరయ్యారు. కరోనా పరీక్షలను చేయించుకోవడానికి ఉద్యోగులంతా క్యూ కట్టారు. ఇంకా ఎంతమందికి కరోనా సోకిందో పరీక్షల ఫలితాల్లో తేలనుంది. జిల్లాలో కూడా 2 వ దశలో కరోనా కేసులు భారీగా నమోదు కానుండటంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది.
రాములోరి పండుగకు ఆంక్షలు
రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఈనెల 21న ఆంక్షల నడుమ శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానంలో కొద్ది మంది ముఖ్య అతిథుల సమక్షంలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. గత ఏడాదిలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారికి ఏకాంత పూజలను అర్చకులు నిర్వహిస్తారు. అంతరంగికంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో సీతారామ కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల ప్రజలెవ్వరూ పండుగకు రావద్దని సూచించారు.
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి కరోనా నివారణకు, వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా , వేగవంతమయ్యేందుకు చర్యలు చేపట్టారు.
Must Read ;- గాలిలోనూ కరోనా ఉంటుందా?