రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని ఒక్కసారే విస్తరించారు. అది కూడా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, మేనల్లుడు తన్నీర్ హరీష్ రావులను మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం, ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించడం కోసం మాత్రం మాత్రమే. ఆ తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించడం గాని పున:సమీక్షించడం గాని చేపట్టలేదు.
మంత్రి వర్గంలో కొందరి పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే కొందరు శాసన సభ్యులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజాధాని హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలో ఎవరో ఒకరికి మంత్రి వర్గంలో స్దానం కలిపించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఒక విధంగా జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలే ఆధారంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నందున నగరంలోని ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మాధవరానికి ఛాన్స్
కూకట్ పల్లితో పాటు మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వీరి ఓట్లను రాబట్టుకునేందుకు సెటిలర్ అయిన మాధవరం కృష్ణారావును మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలలో పట్టు సాధించి అక్కడి నుంచి మిగల జిల్లాలకు విస్తరించాలని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వ్యూహ రచన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండడుగులు ముందేసి కార్పొరేషన్ ఎన్నికలలో 50 శాతం స్దానాలను సెటిలర్స్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడ సెట్టిలర్స్‌కు ఎక్కువ స్దానాలు ఇచ్చే దిశగా సమాలోచనలు చేస్తోంది. ఈ రెండు పార్టీలను సెటిలర్స్ నుంచి దూరం చేసేందుకు మంత్రి వర్గంలోకి సెటిలర్ అయిన మాధవరం కృష్ణారావు ను తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
శాఖలలో మార్పులు… చేర్పులు
ప్రస్తుత మంత్రి వర్గంలో కొందరి మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొందరు మంత్రులను తప్పించడం, మరి కొందరి మంత్రులకు శాఖల మార్పు చేయడం వంటివి చేపడతారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇష్టం మేరకు ఈ మార్పులు, చేర్పులు ఉంటాయిని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తండ్రి కొడుకుల మధ్య రెండు మూడు సార్లు చర్చలు జరిగాయని, ఈ వర్షకాల శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
మంత్రి వర్గంలో మార్పులన్నీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇష్టానికి అనుగుణంగానే జరుగుతాయని అంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన వర్గంగా భావించే కొందరికి కేటీఆర్ మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.











