సిపిఐ ప్రముఖ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి చెందారు. ఉద్యమాల ద్వారానే వ్యవస్థలో మార్పులు వస్తాయని నమ్మి ఉద్యమ బాట పట్టి తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే ధారపోసిన కమ్యూనిస్టు నాయకుడు ఇకలేరు. ఈయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. కార్మిక పక్షపాతిగా ఈయనకు పేరుంది. ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారు. కాగా, గతకొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో గుండా మల్లేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
లారీ క్లీనర్ నుంచి అసెంబ్లీకు..
గుండా మల్లేశ్‌కు కార్మిక నేతగా మంచి పేరుంది. లారీ క్లీనర్ స్ధాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన చరిత్ర ఆయనకుంది. కార్మిక, దళిత, బడుగు బలహీన వర్గానికి గొంతుకగా ఆయన నిలబడ్డారు. ఎప్పడూ ప్రజా సమస్యలపైనే తన పోరాటం ఉండేది. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. కింది స్థాయి నుంచి వచ్చి కార్మిక నేతగా ఎదిగారు. కార్మిక కుటుంబం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన సొంతూరు.. ఆదిలాబాద్ జిల్లా తాండూర్‌లోని రేచిన గ్రామం. ఆయన మెట్రిక్యూలేషన్ పూర్తి చేసి క్లీనర్, డ్రైవర్‌గా కూడా పనిచేశారు. బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్ట్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ తమ సంఘంలోని తోటి కార్మికుల సమస్యలపై పోరాడేవారు. అక్కడి నుంచి సింగరేణిలో కూడా కార్మికుడిగా కొంతకాలం పనిచేశారు. కార్మికుడి స్థాయి నుంచి సిపిఐలో చేరి ఎమ్మెల్యేగా ఎదిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్ నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
సొంతూరులోనే అంత్యక్రియలు!
నిమ్స్‌లో మృతి చెందిన గుండా మల్లేశ్ భౌతిక కాయానికి హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్‌కు తరలించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రముఖుల సందర్శనాంతరం భౌతికకాయాన్ని ఆదిలాబాద్‌లోని ఆయన సొంతూరుకు తరలిస్తారు. ఆయన మరణంలో కార్మికలోకం, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. గుండామల్లేశ్ మరణవార్త విన్న పలువురు నేతలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.











