కర్నూలులో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచారం.. ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ విషయంలో అటు పాత, ఇటు కొత్త ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేదు. న్యాయం చేస్తామని చెప్పిన రాష్ట్ర నాయకులంతా.. మాటలు చెప్పిన తర్వాత.. కాడి పక్కన పారేశారు. ఆ కుటుంబం మాత్రం.. ఇప్పటికీ దీనంగా రోదిస్తూనే ఉంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినా.. న్యాయం దొరకడం లేదనే ఆవేదనతో.. అతీగతీ లేకుండా పోయిందనే బాధతో.. ఆ అమ్మాయి కుటుంబం ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ లోనే ధర్నా చేయడానికి పూనుకుంటోంది.
ఇప్పటికైనా చలనం వస్తుందా?
హస్తినలో తమ గోడు వెళ్లబోసుకుంటే అయినా.. ఇక్కడ అమరావతిలో అధికారుల్లో చలనం వస్తుందేమోనని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆశ. అందుకే వారు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. మీడియా వారు తమకు మద్దతిచ్చి.. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు.
సుగాలి ప్రీతి హత్యోదంతం..
కర్నూలులో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతి గతంలో అత్యాచారం, హత్యకు గురైంది. వల్లెపురెడ్డి జనార్దన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి తమ కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారనేది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణ. కర్నూలు నగరంలోనే 2017 ఆగస్టు 19న ఈ దురాగతం చోటుచేసుకుంది. సుగాలి రాజు, సంగటి పార్వతీ దేవి ల కూతురు అయిన సుగాలి ప్రీతి బాయి.. కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ రెసిడెన్షియల్ ప్రెవేటు స్కూలులో పదో తరగతి చదువుతుండగా.. ఈ దారుణం జరిగింది.
ఆమె తల్లిదండ్రులు ఈవిషయంపై ఎంతగా పోరాడినా ఫలితం దక్కలేదు. అప్పట్లోని తెలుగుదేశం ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం జరిగి తీరాల్సిందేనంటూ ఒక ఉద్యమం కూడా నడిపారు. కర్నూలు రోడ్లలో పాదయాత్ర కూడా నిర్వహించారు. అనంతర కాలంలో.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కర్నూలు పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. ఆ సందర్భంగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తానని జగన్ వారికి మాట ఇచ్చారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు గానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా.,. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. ఈ నేపథ్యంలో ఏకంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ జంతర్ మంతర్ వద్దనే ధర్నా నిర్వహించాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నిర్ణయించారు. బుధవారం ఉదయం ఈ ధర్నా జరుగుతుంది.
ఇప్పటికైనా పాలకుల్లో మార్పు వస్తుందో లేదో.. విచారణను త్వరిగతిన పూర్తి చేయించి వారికి న్యాయం చేస్తారో లేదో.. వేచిచూడాలి.