ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలలో ‘కలర్ ఫోటో’ ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. నిజానికి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు .. ‘సుహాస్’ కూడా హీరోగా ఒక ప్రయత్నం చేశాడు అనే అనుకున్నారు. ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా .. ఆర్టిస్టుల పరంగా చిన్న సినిమానే అయినా పెద్ద సినిమాల స్థాయిలో ఆదరణ లభించింది. బలమైన కంటెంట్ .. దానిని ప్రెజెంట్ చేసిన తీరు యూత్ ను మెప్పించింది. దాంతో ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఒక మంచి ప్రయత్నంగా అభినందనలు అందుకుంది.
ఈ సినిమాలో కథానాయికగా ‘చాందినీ చౌదరి’ అలరించింది. గతంలో ఓ మాదిరి సినిమాల్లో చేసిన అనుభవం ఈ అమ్మాయికి ఉంది. ‘కుందనపు బొమ్మ’ .. ‘శమంతకమణి’ .. ‘హౌరా బ్రిడ్జి’ .. ‘మను’ సినిమాలతో ఈ అమ్మాయి ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆ సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడం వలన చాందినీకి సరైన బ్రేక్ రాలేదు. అలాంటి సినిమాల్లో ‘కలర్ ఫోటో’ కూడా ఒకటి అనే అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరువాత అలాంటివారి అభిప్రాయాలు మారిపోయాయి. కథలోను .. పాత్రలోనూ విషయం ఉంటే ఈ అమ్మాయి అద్భుతంగా చేస్తుందనే విషయం వాళ్లకి అర్థమైపోయింది.
‘కలర్ ఫోటో’ సినిమాలో శ్రీమంతురాలు పాత్రలో చాందినీ కనిపించింది. పై పై మెరుగులు కంటే ఆత్మ సౌందర్యం గొప్పదని నమ్మే పాత్రకి ఆమె జీవం పోసింది. ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలిచింది. ఆ పాత్రలో ఆమె చూపిన సహజత్వం .. ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో యూత్ లో ఆమె క్రేజ్ పెరిగింది.కుర్ర హీరోలు తమ సినిమాల్లో ఆమె అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. దాంతో ఆమెను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఆమె కెరియర్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.