అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో నారా లోకేష్‌ఫై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడిని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి ఆపాదిస్తూ లోకేష్ ట్వీట్ చేశారని, దీంతో ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిందంటూ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 153(ఏ), 505, 506 సెక్షన్ల కింద లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ కేసులతో భయపెట్టలేరు..
అక్రమ కేసులతో తమను భయపెట్టలేరని టీడీపీ నాయకుడు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇటీవల వైసీపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని టీడీపీ కార్యకర్త మారుతిపై దాడి చేశారన్నారు.దానిపై నారా లోకేష్ స్పందిస్తే ఆయనపై అక్రమ కేసు పెట్టారన్నారు. అధికార మదంతో వైసీపీ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో కొంతమంది దోపిడీ దారులు చేసే దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేయడం, అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని శ్రీనివాసులు పేర్కొన్నారు.











