కరోనాపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకునే పాలసీల్లో మార్పులు చేశారు.కరోనా లక్షణాలు ఉంటే ఆసుపత్రుల్లో చేరవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.ఆసుపత్రుల్లో చేరాలంటే కరోనా పాజిటివ్ రిపోర్టు అవసరం లేదని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా రోగులు దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చని సూచించింది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు కూడా అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
లక్షణంగా చేరవచ్చు..
కరోనా ఉన్నా రిపోర్టుల్లో నెగటివ్ వస్తున్న సందర్భాలను వైద్య నిపుణులు గుర్తించారు. అందుకే కరోనా లక్షణాలు ఉంటే చాలు దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా, ఎలాంటి గుర్తింపు కార్డు చూపకుండానే చేరవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ల వల్ల కరోనా ఉన్నా నెగటివ్ రావడం, మరికొన్ని సందర్భాల్లో కరోనా లక్షణాలు కూడా 20 శాతం మందిలో బయటపడకపోవడం ప్రమాదకరంగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రోగులను డిశ్చార్జ్ చేసేప్పుడు పాలసీని పాటించాలి. వారికి వైద్యులతో అవసరం పడదనుకుంటేనే రోగులను డిశ్చార్జ్ చేయాలని కేంద్రం సూచించింది. ఒక ప్రాంతం వారు మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడ కరోనా భారిన పడితే వైద్యం నిరాకరిస్తున్న సందర్భాలు గుర్తించారు. అందుకే ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా గుర్తింపు కార్డుతో పనిలేకుండా వైద్యం చేయాలని కేంద్రం ఆదేశించింది.










