ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు తేజ. ఒకదశలో వరుసగా హిట్స్ కొట్టిన తేజ.. ఆ తర్వాత కాలంలో పూర్తిగా తన ఫామ్ ను కోల్పోయారు. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన రానా హీరోగా నేనే రాజు నేనేమంత్రి సినిమా తెరకెక్కించి మంచి విజయం దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన తీసిన ‘సీత’ చిత్రం పరాజయం పాలైంది. ప్రస్తుతం తేజ గోపీచంద్ హీరోగా అలివేలుమంగ వెంకటరమణ అనే ప్రేమ కథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. ఇక తేజ మొన్నా మధ్య మరో సినిమా అనౌన్స్ చేశారు. దాని పేరు ‘చిత్రం 1.1’.
తన మొదటి సినిమా ‘చిత్రం’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా యన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర హీరోగా నటిస్తాడంటూ.. నిన్న మొన్నటివరకూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. చిత్రం 1.1 లో హీరో అతడు కాదట. తేజ తనయుడు అమితోవ్ హీరోగా నటిస్తాడట.
ఉదయ్ కిరణ్ , రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమా .. ఇద్దరు ప్రేమికులు ఇంటర్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కనడం ఈ సినిమా కాన్సెప్ట్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఇప్పుడీ సినిమా సీక్వెల్ తో తన కుమారుడు అమితోవ్ ను తేజ హీరోగా తెరకు పరిచయం చేస్తూండడం ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అప్టేట్ వస్తుందట. మరి నిజంగానే తేజ కొడుకు ఈ సినిమా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
Must Read ;- తేజకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి











