ఒక్క సీటీ స్కాన్ చేయడం అంటే 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్ రే చేయడంతో సమానమని, క్యాన్సర్‌కు సైతం దారి తీసే అవకాశాలున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న వారు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. లక్షణాలు లేని 30-40 శాతం మందిలో సీటీ స్కాన్ చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ అనే వస్తోందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.
400 ఎక్స్ రేలకు సమానం
ఒక్క సీటీ స్కాన్ 400 ఎక్స్ రేలకు సమానమని, అంతేకాక మున్ముందు కేన్సర్ బారినపడే అవకాశం కూడా ఉంటుందన్నారు. ముఖ్యంగా యువతలో ఈ ముప్పు మరింత ఎక్కువన్నారు. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే తొలుత చాతీ ఎక్స్ రే తీయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

అవసరమైతేనే…
సీటీ స్కాన్‌ను కూడా అత్యవసరమైతేనే చేయించాలని సూచించారు. కరోనా తొలి దశలో స్టెరాయిడ్స్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా అది ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉందన్నారు. చీటికిమాటికి కాకుండా, అవసరమైతే స్కాన్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. కరోనా అనుమానంతో చాలామంది సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, సిగరెట్లు ఎక్కువగా తాగేవారు.. ఏ ఇబ్బంది లేకున్నా కొవిడ్ పాజిటివ్ వచ్చిన వెంటనే సీటీ స్కాన్ చేయించుకోవాలని పలువురు డాక్టర్లు చెప్తున్నారు.










