దేవరయాంజల్‌లో కేసీఆర్ కుటుంబంతో పాటు నమస్తే తెలంగాణ పత్రిక, మంత్రులకు కూడా భూములున్నాయని సర్వే నెంబర్లతో సహా టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణల చేయడంతో రాష్ట్రంలో కొత్త చర్చమొదలైంది. అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలను కారణంగా చూపుతూ మంత్రి ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆన్ లైన్‌లో కనిపించని భూముల వివరాలు
దేవరయాంజల్ ప్రాంతంలో రామాలయానికి చెందిన 1,553 ఎకరాల భూమిలో కేటీఆర్‌కు, నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్‌రావు తదితరులకు భూములున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూములు దేవాదాయ శాఖకి చెందినవని చెప్పారు. ఈ భూముల వివరాలు ఆన్ లైన్‌లో కనిపించడంలేదని, ధరణి పోర్టల్‌ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. టైటిల్ డీడ్‌లతో సహా చూపించిన రేవంత్ రెడ్డి..ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు సర్వే నెంబర్ 658లోని భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకోవడంతో పాటు ఏడు ఎకరాల్లో ఫామ్‌హౌజ్ కట్టుకున్నారని విమర్శించారు. వీటితోపాటు సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్‌కు కూడా వాటా ఉందని విమర్శించారు. 1925 నుండి 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్‌ను, మల్లారెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రజాసంఘాలు, పార్టీలు, సంఘాలతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సర్వే నెం. 437లో 2ఎ-08 గుంటల భూమి నమస్తే తెలంగాణ, దివికొండ దామోదర్‌రావు, సర్వే నెం. 437లో 1 ఎకరం కేటీఆర్ , సర్వే నెం.438 లో 1 ఎకరం సురభి భీమ్‌రావు, సర్వే నెం.438లో 2 ఎకరాలు సురభి నవీన్‌కుమార్, సర్వే నెం. 438లో 20 గుంటలు సురభి జయశ్రీ పేరుతో ఉందని, ఈ భూములను తాకట్టు పెట్టి నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్‌కు బ్యాంకుల్లో కోట్లల్లో రుణం పొందినట్లు రేవంత్ ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
కాగా ఈ ప్రాంతంలో అసైన్డ్ భూములను ఆక్రమించారన్న ఆరోపణలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం సంచలనం రేపింది. ఈటలకు పలువురు నాయకులు మద్దతు తెలపడంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు మంత్రుల అక్రమాల మాటేంటనే విమర్శలు మొదలుపెట్టారు.మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత మొదటిసారి సొంత నియోజకవర్గానికి ఈటల భారీ కాన్వాయ్‌తో వెళ్లారు.నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి తరువాతి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. హుజూరాబాద్‌లో ఈటలకు ఘన స్వాగతం పలికారు.కాబోయే సీఎం ఈటల అని అభిమానులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. భూ ఆరోపణలపై ఇక స్పందించనని వ్యాఖ్యానించడంతో పాటు,తెలంగాణలో తనపై జరుగుతున్న కుట్రను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.
తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. గతంలోనే ఈటలను టార్గెట్ చేస్తున్నారని, ఈటల మెడకు కత్తి వేలాడుతోందని చెప్పిన విషయాన్ని కూడా పలువురు నాయకులు ప్రస్తావిస్తున్నారు.











