ఆయన శరీరం విల్లులా ఒంగుతుంది. కాళ్ళు, చేతులు స్ప్రింగుల్లా మెలితిరుగుతాయి. ఎనలేని ఎనర్జీ, తిరుగులేని గ్రేస్, తనకు మాత్రమే సాధ్యమైన ఒక స్టైల్ ఆయన సొంతం. పాటలోని బీట్ కు అనుగుణంగా.. లయాత్మకంగా ఆయన వేసే స్టెప్స్ ను చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. వెస్ట్రన్ బీట్ అయినా.. క్లాసికల్ ట్యూన్ అయినా.. జానపద దరువైనా.. ఆయన పద విన్యాసాలకు దాసోహం అవ్వాల్సిందే. నాలుగు దశాబ్దాల కాలంగా.. తెలుగు తెరను తన డ్యాన్సింగ్ టాలెంట్ తో అబ్బుర పరుస్తూ.. కోట్లాదిమంది అభిమానుల గుండె చప్పుడైన ఆయన పేరు చిరంజీవి.
కింగ్ ఆఫ్ డ్యాన్స్ , ది డ్యాన్సింగ్ కింగ్ లాంటి బిరుదులతో ఇండియన్ తెరకే నటరాజు అయ్యారు. ఎందుకంటే. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటేనే డ్యాన్స్ కదా… ఒకప్పుడు తెలుగు తెరకు అక్కినేని నాగేశ్వరరావు డ్యాన్స్ ను పరిచయం చేస్తే.. ఆ తర్వాత తరానికి చిరంజీవి అందులోని అద్భుతాన్ని పరిచయం చేశారు. అనేకసార్లు దాని మాధుర్యాన్ని రుచి చూపించారు. వాస్తవానికి చిరంజీవి టాలీవుడ్ కు మెగాస్టార్ అయింది ..ఆయనలోని డ్యాన్సింగ్ టాలెంట్ వల్లనే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
చిరంజీవి 1978 లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే తనలో ఒక గొప్ప డ్యాన్సర్ ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. విశేషమేంటంటే.. ఆయన విలన్ గా నటించిన సినిమాల్లో కూడా ప్రత్యేకించి ఆయన డ్యాన్సుల కోసమే .. ఆయన మీద ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించేవారు అప్పటి దర్శకులు . ఆ తర్వాత ఒకో సినిమాతో నటుడిగా ఒకో మెట్టు ఎక్కుతూ.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. సరికొత్త స్టెప్స్ వేయాలని… తను బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకోవాలని తపిస్తూ.. కఠినమైన సాధన చేసేవారు చిరంజీవి .
పర్టిక్యులర్ గా షూటింగ్స్ లేని సమయాన్ని ఆయన డ్యాన్స్ ప్రాక్టీస్ కే కేటాయించేవారని .. ఆయన సన్నిహితులు ఎందరో చెబుతుంటారు. అప్పట్లో సలీమ్ మాస్టర్, తారా మాస్టర్, శివ సుబ్రహ్యణ్యం మాస్టర్స్ చిరంజీవిలోని గ్రేస్ ను , ఆయన నిశిత పరిశీలనా శక్తిని బాగా ఉపయోగించుకొనేవారు. ఒక్కసారి డ్యాన్స్ మూమెంట్ వేసి చూపిస్తే చాలు.. దాన్ని మరింత గా ఇప్రవైజ్ చేసి.. దానికి మరింతగా మెరుగులు దిద్ది.. వారినందరినీ ఆశ్చర్యపరిచేవారట. ప్రత్యేకించి సుందరం మాస్టర్ చిరంజీవి బాడీలోని ఫ్లెక్సిబిలిటీకి చాలా ఆశ్చర్యపడేవారట. ఆయన స్పీడ్ కు షాకయ్యేవారట. ఇక ఆ తర్వాత తరం కొరియో గ్రాఫర్స్ ప్రభుదేవా, లారెన్స్ , శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్.. డ్యాన్సుల పరంగా చిరంజీవిని డ్యాన్సింగ్ గాడ్ గా అభివర్ణిస్తారు.
నేటి తరం హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ చిన్నప్పటినుంచీ చిరంజీవి డ్యాన్సుల్ని చూసి పెరిగారు. ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని .. తమ డ్యాన్సులకు మెరుగులు దిద్దుకున్నారు. ఇప్పుడు బెస్ట్ డ్యాన్సర్స్ గా ఎదిగారు. అలాగే చిరంజీవిని ఇన్స్ పైర్ గా తీసుకొని టాలీవుడ్ లో హీరోలుగా వచ్చిన వారంతా.. ఆయన డ్యాన్సులకు అభిమానులే. సినిమాలకు దాదాపు పదేళ్ళ గ్యాపిచ్చి.. ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో టాలీవుడ్ లో కమ్ బ్యాక్ అయ్యారు చిరంజీవి. అయినాసరే… ఈ వయసులో కూడా తనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ.. అందులోని పాటలకు వెరైటీ స్టెప్స్ వేస్తూ .. ఇప్పటి జెనరేషన్ కుర్రోళ్ళను కూడా ఉర్రూతలూపారు. ప్రస్తుతం 152 మూవీ ఆచార్యలో నటిస్తున్నారు చిరంజీవి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కూడా చిరంజీవి తన ట్రేడ్ మార్క్ డ్యాన్సులతో అభిమానుల్ని అలరించనున్నారు. నేడు చిరంజీవి పుట్టిన రోజు. అలాగే.. వినాయక చవితి కూడా. ఆల్రెడీ వినాయకుని తండ్రి అయిన నటరాజ స్వామి అనుగ్రహాన్ని ఎప్పుడో పొందారు చిరంజీవి. రాబోయే ఆచార్య సినిమా కు వినాయకుని అనుగ్రహం ఆయనమీద మెండు గా నిండుగా ప్రసరించాలని .. దిలియో న్యూస్ .కామ్ కోరుకుంటూ.. చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ ….










