ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం వరకూ ఆసక్తికరంగా సాగిన రాజకీయాలు కాస్త చల్లబడ్డాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యాక ఇక టీడీపీ ప్రచార కార్యక్రమాలు ఇక ఉధృతంగా ఉంటాయని భావించారంతా. అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన తీరును బాగా జనాల్లోకి తీసుకెళ్లాలా టీడీపీ కార్యక్రమాలు ఉంటాయని అనుకున్నారు. కానీ, దీనికి పూర్తి వ్యతిరేకంగా పరిస్థితి ఉంది. కంటికి ఆపరేషన్ జరిగిన కారణంగా చంద్రబాబు విశ్రాంతిలో ఉండగా, నారా లోకేశ్ కానీ, భువనేశ్వరి కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ప్రజల్లోకి సైతం రావడం లేదు. లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ మొదలు కాలేదు, భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కూడా ముగిసినట్లే ఉంది. అటు పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. బెయిల్ పై ఉన్న చంద్రబాబు ప్రసంగాలు చేయొద్దనే ఆంక్షలు ఉన్నప్పటికీ మిగతా కీలక నేతలు కూడా ప్రస్తుతం కాస్త దూరంగానే ఉంటున్నారు.
ఇలా విపక్షాలన్నీ సైలెంట్ గా ఉంటున్నప్పటికీ అధికార వైఎస్ఆర్ సీపీలో మాత్రం కలవరం అంతే ఉంది. ప్రస్తుతం వారు సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇటు విపక్షాలు సైలెంట్ గా ఉన్న సమయంలోనూ వైఎస్ఆర్ సీపీ నేతలు వారిపై ప్రయోజనం లేని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లాలోని మాచర్ల వద్ద ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్ గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడారు. 50 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడెందుకు అన్నట్లుగా, అప్పటికి ఎవరు బతికి ఉంటారు అన్నట్లుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు జగన్ పరిపక్వత లేని ఆలోచనా విధానాన్ని చాటుతోంది.
గురువారం సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా పనికట్టుకొని చంద్రబాబు మీద విమర్శలు చేయడానికే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబుకు గుండె సమస్య ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని ఆధారంగా చేసుకొని సజ్జల చంద్రబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక ఇచ్చిన పేరున్న ఆస్పత్రిని సైతం సజ్జల వదల్లేదు. ఆ రిపోర్టు ఇచ్చిన డాక్టర్లు పొలిటికల్ డాక్టర్లు అని ఎద్దేవా చేస్తూ సజ్జల మాట్లాడారు. చంద్రబాబు తన బెయిల్ గడువును పెంచుకోవడానికే ఈ విధమైన నాటకాలు ఆడుతున్నారని సజ్జల ఆరోపించారు. మొత్తానికి అధికార పార్టీ వైఖరి చూస్తుంటే, లోలోన కలవరపాటు ఉందనే అర్థం అవుతోంది. సునామీకి ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుందన్న చందంగా తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు ఈ గ్యాప్ లో టీడీపీ వ్యూహాలు రచించుకుంటోందని అధికార పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.