ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కంపెనీలపై త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈడీ ఏపీ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఈ మధ్య ఢిల్లీలో జగన్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అవకతవకలు బయటపడ్డాయని సమాచారం. ఈడీ ఢిల్లీలోని కొన్ని కంపెనీలపై వేరే కేసుల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వాటితో ఏపీకి సంబంధం ఉందని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వాటికి కాంట్రాక్ట్ లు ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ గుట్టు బయటపడడం వల్లే ఈడీ అధికారులు ఏపీపై దృష్టి పెట్టబోతున్నట్లుగా సమాచారం.
రహస్య జీవోలపై హైకోర్టుకు..
ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు ఇస్తున్న జీవోలు ప్రజలు లేదా జర్నలిస్టులు సులభంగా చూసే వీలు లేకుండా గోప్యత పాటిస్తున్న తీరుపై పలువురు హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు కూడా దీన్ని తప్పుబట్టింది. ఆ జీవోలను వెబ్ సైట్లో పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. కానీ, ప్రభుత్వం తరపు న్యాయవాది సుమన్ సమాధానం చెప్తూ.. అంతగా ముఖ్యమైన జీవోలను అప్‌లోడ్ చేయడం లేదని చెప్పారు. అత్యవసరం అయితే, మరుసటి రోజు అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.
ఈ రహస్య జీవోలన్నీ అవకతవకలకు తావు ఇచ్చేలా ఉన్నాయనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో భాగంగా వివిధ ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంలో లొసుగులు ఉండడం వల్లే జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని విపక్షాలు ఎప్పటినుంచో వాదిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఢిల్లీలో ఈడీ అధికారులకు కాస్త లీకులు దొరకడంతో ఏపీలో కొన్ని సంస్థలపై దాడులు ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
వీటినీ మేనేజ్ చేస్తారా?
అయితే, జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతే లభిస్తోంది. తాజాగా చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా కేంద్ర పెద్దల నుంచి మద్దతు ఉన్నట్లుగానే కనిపించింది. సీఎం జగన్ కూడా చాలా విషయాల్లో వ్యవస్థలను మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నందున.. జరగబోయే ఈడీ దాడుల నుంచి తప్పించుకొనే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈడీ కనిపెట్టిన ఈ అవకతవకల విషయంలో జగన్ సర్కార్ పై ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తుందా లేక, మిన్నకుండిపోతుందా అనేది ఆసక్తి నెలకొంది.