వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్ సీపీలో టికెట్ల కేటాయింపు విషయంలో మథనం సాగుతోంది. ఈసారి పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని అన్ని సర్వేలు చెబుతుండడంతో, టికెట్ల కేటాయింపును పూర్తిగా ప్రక్షాళన చేసి కాస్త వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని వారిని తప్పించడమో లేక, మరో చోటికి తరలించడమో, లేదా ఎంపీగా పోటీ చేయించే అంశాలను పరిశీలిస్తున్నారు. వీరిలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మంది ఆయా స్థానాల నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉండగా, వారిలో 11 మందికి మాత్రం తమ స్థానాల నుంచే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం ఫిక్స్ అని తెలుస్తోంది. మిగతా మంత్రుల్లో కొందరిని లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొందరు మంత్రులకు వారి నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత వల్ల అసలు టికెట్లు ఇవ్వొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయించాలని అనుకునే ప్రస్తుత మంత్రుల్లో ఉషశ్రీ చరణ్, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి ఉషశ్రీ చరణ్ సామాజిక వర్గ జనాభా ఎక్కువగా రాప్తాడులో ఉండడం వల్ల ఆమెను అక్కడి నుంచి పోటీ చేయిస్తారని సమాచారం.
బెర్తులు ఖరారు చేసుకున్న వారిలో మాత్రం ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా, కాకాణి గోవర్థన్, సీదిరి అప్పలరాజు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, రాజన్న దొర, బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, బూడి ముత్యాల నాయుడు తదితరులు ఉన్నట్లు సమాచారం. కాకపోతే వీరిని అవే స్థానాల నుంచి కాకుండా వారికి ప్రజల్లో ఉన్న వ్యతిరేక వల్ల మరోస్థానానికి మార్పు చేయవచ్చని తెలుస్తోంది.
ఇక మంత్రి రోజా విషయంలో మాత్రం టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఆమె పట్ల పార్టీలోనే వ్యతిరేకత ఉంది. నారాయణ స్వామి, మాజీ మంత్రి జ్ఞానేంద్రరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు టికెట్ల విషయం కూడా తేలాల్సి ఉంది. అదీకాక, టీడీపీ-జనసేన పొత్తు ఉన్నందున వారు నిలిపే అభ్యర్థులను బట్టి కూడా వైసీపీ అధిష్ఠానం సీట్ల కేటాయింపు కీలక నిర్ణయం తీసుకోనుంది.











