టైగర్ నాగేశ్వరావు.. ఒకప్పుడు గడగడలాడించిన గజదొంగ ఇతడు. కానీ అతనిలో మరో కోణం కూడా ఉంది. ఉన్న వారిని దోచుకుని పేదలకు పంచుతాడన్నదే ఆ కోణం. ఇదే అంశాన్ని తీసుకుని రవితేజ హీరోగా సినిమా చేశారు దర్శకుడు వంశీ కృష్ణ. మరి ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఈ సినిమాలో రవితేజను ఎలా చూపించబోతున్నారు అన్నది ఆయన మాటల్లోనే చూద్దాం.
చెప్పండి ఈ సినిమా కథను ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్ధేశం ఏమిటి?
రాజమౌళి గారి చూశాక మనం ఏదైనా చేస్తే హైస్టాండర్స్ లో చేయాలనుకున్నా.. దాంతో పాటు మనకు కావాల్సిన ఆడియన్స్ కు ఏం కావాలో అది కూడా అతని కథలో ఉంది. కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాను. కచ్చితంగా ఈ కథ ఆడియన్స్ కు చేరుతుంది.
ఎన్నో కథలు ఉండగా దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు కథనే ఎందుకు ఎంచుకున్నారు?
ఎవరికైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కమర్షియల్ సినిమా చేయాలి. అదే ప్రధానం దాన్ని మనం వదలకూడదు. ఏ ఫిల్మ్ మేకర్ అయినా ఓ బయోపిక్ చేయాలనుకుంటాడు. ఎలాంటి బయోపిక్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకు చిన్నప్పట్నుంచీ ఇలాంటి బయోపిక్ చేయాలని ఉండేది. తెలియని కథను కూడా చెప్పవచ్చు కదా. సాధారణంగా క్రీడాకారులు, పొలిటిషియన్లు, సినిమా నటులతో బయోపిక్ చేస్తుంటారు. ఇది యూనిక్ గా ఉండే కథావస్తువు. టైగర్ నాగేశ్వరరావుకు ఇంత పెద్ద బజ్ రావడానికి కూడా కారణం అదే. ఒకరకమైన క్యూరియాసిటీ ఈ కథ ద్వారా ఏర్పడుతుంది.1980లో ఆయన చాలా చేశారు.
రెండేళ్లపాటు ఈ కథ మీద నేను రీసెర్చ్ చేశాక చాలా విషయాలు తెలిశాయి. ప్రతి ఆరునెలలకూ ఆ ప్రాంతానికి వెళ్లి పది రోజులు స్టూవర్ట్ పురంలో ఉండేవాడిని. పది విషయాలు తెలిశాయి అనుకున్నప్పుడు మళ్లీ మూడు నెలలు ఆగి వెళ్లాక ఆ పదికి మించి మరెన్నో విషయాలు తెలిసేవి. ఆ పాత్ర నన్ను కూడా వదల్లేదు.. ఎందుకంటే ప్రతిసారీ ఏదోఒకటి మనకు ఇస్తూనే ఉంది.అలాంటప్పుడు మనకు కూడా ఇంట్రస్ట్ ఏర్పడుతుంది కదా. ఈ బయోపిక్ నే ఎంచుకోవడానికి కారణం అతనికి గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.మనకు తెలిసిందల్లా అతను దొంగే.. అతని ఇన్నర్ సోల్ ఎవరికీ తెలియదు. ఆ ఇన్నర్ సోల్ ఎంతో గొప్పది.. దాన్ని సినిమాలో పెట్టవచ్చని అనిపించింది.
ఇండియాలో చాలా మంది దొంగలున్నారు అలాంటప్పుడు టైగర్ నాగేశ్వరరావే ఎందుకు?
అదే అంటున్నా కదా.. టైగర్ నాగేశ్వరావు యాజ్ ఆన్ ఎమోషన్. అంతకు మించిన ఎమోషన్ నేను చూడలేదు. అతను రాబిన్ హుడ్డేనని మీ అందరకూ తెలుసు.బట్ ఎందుకు రాబిన్ హుడ్ అన్నదే ప్రధానాంశం. అతని జీవితంలో రెండు కోణాలు ఉన్నాయి. ఒక కోణంలో అతను చాలా భయంకరమైన వ్యక్తి, ఇంకో కోణంలో అందుకు పూర్తి భిన్నం. అతను ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్. ఆ ట్రాన్స్ ఫర్మేషన్ చూస్తే వీడేంటే అటూ ఉన్నాడు ఇటూ ఉన్నాడు అనిపిస్తుంది.
ఈ కథను తెరకెక్కించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?
సినిమాను విమర్శించడం చాలా ఈజీ. ఎక్కడ పాటలు పెట్టుకోవచ్చు.. ఎక్కడ ఫైట్లు పెట్టుకోవచ్చు అనుకుంటాం. ముఖ్యంగా డైరెక్టర్ కు బయోపిక్ చేయడం చాలా కష్టం.ఎందుకంటే మీకు ఆల్రెడీ సగం విషయం తెలిసిపోయి ఉంటుంది. ఈ తెలిసిన విషయాన్ని మళ్లీ నేను చెప్పాలి. తెలిసిన విషయాన్నే మళ్లీ చెప్పాలంటే ఇంకా కష్టం. అందుకే ఏ బయోపిక్ అయినా చేయడం చాలా కష్టం. నాగ్ అశ్విన్ కూడా మహానటి చేశారు అంటే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కన్వెన్షన్ తో మిమ్మల్ని నమ్మించాలి, కన్విన్స్ చేయాలి. కన్విక్షన్ తో తను చేసిన దోపిడీలు గురించి మీరు విని ఉంటారు.. కానీ నేను చూపించేటప్పుడు అబ్బ అని అనిపించాలి కదా. దాన్ని నేను ఎంత ఇంట్రస్టింగ్ గా చూపిస్తాను అన్నది పెద్ద టాస్క్.
అతని గురించి చాలా కథలు ఉన్నాయి వాస్తవాలు ఏమిటన్నది ఎవరికీ తెలియదు. మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు?
అతని భార్య చెప్పింది, వాళ్ల అన్నయ్య చెప్పాడు, వాళ్ల పిల్లలు చెప్పారు, పోలీసులు కొంతమంది చెప్పారు. అన్నీ వాస్తవాలే. అతని గురించి కథలు కథలుగా ఉన్నాయిగానీ ఎక్కడా ఆధారాలు లేవు. ట్రెయిన్ తో సమానంగా పరుగెత్తేవాడు అంటారు. అది సాధ్యమే కాదు కానీ అతను చేసేవాడని చెబుతున్నారు. వారు చెప్పేటప్పుడే నాకు అనిపించేది అతను హైస్కిల్ రాబరీస్.. అంటే చెప్పి మరీ దోపిడీలు చేసేవాడట. మీ ఇంట్లో బంగారం ఉందట కదా రేపు పదకొండు గంటలకు వచ్చి దొంగతనం చేస్తాను అని చెప్పి మరీ చేసేవాడట. అది వినటానికి బాగుంది కానీ ఎలా చేస్తాడో మనకు తెలియదు. అలాంటి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ ఫ్రూఫ్ లేదు ఎందుకు లేదంటే ఇది 1980 కథ. అప్పుడు సోషల్ మీడియా లేదు.
పేపర్ కటింగులే తప్ప మరే ఆధారమూ లేదు. అది కూడా దొంగల మీద ఎవరూ రాయరు కదా. అతను చేసినవి ఏవీ బయటకు రాలేదు. ఎవరూ బుక్స్ కూడా రాయలేదు. చాలా మందికి బయోపిక్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గూగుల్ లోనో, పుస్తకాల్లోనూ సమాచారం ఉంటుంది. ఇతని గురించి అతని సమాచారం ఏమీ నా దగ్గర లేకపోవడం వల్ల నాకు చాలా కష్టమైంది. అందుకే నా రీసెర్చ్ ను వేరేలాగా మార్చాను. కొంతమంది పోలీసుల్ని వెళ్లి కలిశాను. వాళ్ల రికార్డులు ఉంటాయి. వాటిని కూడా 15 ఏళ్ల తర్వాత రిన్నోవేట్ చేస్తారు. ఆయనతో సంబంధాలు ఉన్నవారు చాలా మంది చనిపోయారు. విషయాలు దొరికాయిగానీ డాక్యుమెంటు రూపంలో లేవు. వాటిని తీసి నేను మిమ్మల్ని నమ్మించాలి. ఇందిరా గాంధీతో ఏమిటి సంబంధం అని మీరు అడుగుతారు మీకు అది చూపించాలి. మీరు ఫ్రూఫ్ అడుగుతారు. అది ఎక్కడా దొరకదు. అందుకే ట్రూ రూమర్స్ అని పెట్టా. నిజమైన కట్టుకథలు అనే చెప్పాలి.
ఈ సినిమాలో ఉన్న అన్ని పాత్రలూ రియల్ లైఫ్ లోనివేనా?
దాదాపు అన్నీ నిజమైన పాత్రలే. ఒకటి రెండు మాత్రమే ఫిక్షనల్ పాత్రలు.
గజ్జల ప్రసాద్ కూ, టైగర్ నాగేశ్వరావుకు ఉన్న సంబంధం ఎలాంటిది?
వారిద్దరూ ఒక ఊరి వారే. ఈ సినిమాలో గజ్జల ప్రసాద్ కు సంబంధించి ఎక్కువ చూపించలేదు. టైగర్ నాగేశ్వరావుకు విరోధి గజ్జల ప్రసాద్ అంటారు.
ఇది 1970-80 కథ అంటున్నారు. అప్పట్లో అతని వల్ల ఇబ్బంది పడిన వారు చాలా మంది ఉంటారు. మంగళ సూత్రాలు తెంపుకు వెళ్లేవాడు లాంటి అంశాలు?
మీరు సినిమా చూస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు తెంపుకు వెళ్లాడు అనేది మీకు తెలుస్తుంది.దానికి జస్టిఫికేషన్ ఇందులో ఇచ్చాను. సినిమాలో అలాంటి సన్నివేశం ఉంది. సమాధానం కూడా మీకు దొరుకుతుంది.
ఈ సినిమాలో అతని జీవితానికి సంబంధించి ఏఏ అంశాలున్నాయి?
చాలా ఉన్నాయి. ఆ గ్రామస్తులు కూడా చాలా చెప్పలేకపోయారు. ఉదాహరణకు ట్రైన్ దొంగతనం ఉంది. ఆ దొంగతనం చేస్తాడని తెలుసుగానీ ఎలా చేస్తాడన్నది తెలియదు. ఎంత 1980 కథ అయినా చూసేవారు 2023 వాళ్లే. పాత కథ కదా అని పాత తరహాలో చెబితే ఎవరూ చూడరు. రాజమండ్రి బ్రిడ్జిమీద దొంగతనం సన్నివేశం చిత్రీకరించాం. దాన్ని బాగా ఎలివేట్ చేశాం.
ఇంతకీ ఈ సినిమాలో టైగర్ పాత్రని చంపేశారా? ఉంచారా?
అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ పాత్ర కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ అవకాశం ఎలా వచ్చింది?
నాలుగేళ్లుగా ప్రయత్నిస్తుంటే సడన్ గా అభిషేక్ గారు ఫోన్ చేసి రవితేజ గారికి చెప్పించారు. ఫస్టాఫ్ విని వంశీ నాకు షూటింగ్ ఉంది రేపు కలుస్తాను అన్నారు. ఇక కాల్ రాదేమో అనుకున్నా. కచ్చితంగా ఆయన చెప్పిన టైమ్ కి ఫోన్ చేశారు. షూటింగ్ నుంచి బయలుదేరాను నువ్వు వచ్చేసెయ్ అన్నారు.. వెళ్లాను. సెకండాఫ్ చెప్పాను. బ్యూటీ ఏంటంటే మనం సినిమా చేస్తున్నాం అన్న మాట రవి సార్ నుంచి వస్తుందేమో అనుకున్నా. క్లైమాక్స్ నెరేషన్ ఇస్తుంటే కుర్చీలోంచి లేచి జుట్టు ఇలా పెంచితే బాగుంటుందా? ఆయన ఆల్రెడీ ఓకే చేసేసి పాత్రలోకి వెళ్లిపోయారు. అది నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది. సినిమాలో పరుగెత్తే సన్నివేశాలు ఆయనే చేశారు. డూప్ అవసరం లేకుండానే చేశాం. ఆయన బాడీ కూడా అలాంటిదే. దగ్గరగా చూసేవారికే తెలుస్తుంది. షర్ట్ లేకుండా సినిమాలో ఓ షాట్ కూడా ఉంది. ఆయన బాడీని ఎలా మెయింటెయిన్ చేస్తాడో దాన్ని బట్టే అర్థమవుతుంది.
ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో బడ్జెట్ వైజ్, క్యాస్టింగ్ వైజ్ ఇదే పెద్దది. ఎలా హ్యాండిల్ చేశారు?
ఒత్తిడి అసలు లేదు. ఫస్ట్ సినిమా నా విజిటింగ్ కార్డు.. రెండో సినిమా కథ నాది కాదు. సో అది బ్రేక్ చేయడానికే టైమ్ పట్టింది. ఇందులో ఇంట్రస్టింగ్ సెలబ్రిటీస్ కాకుండా ఇంట్రస్టింగ్ ఫేసెస్ ఉంటాయి. వాళ్లకి కూడా ఈ జానర్ కొత్తగా ఉంటుంది. అందకే వాళ్ల సొంత సబ్జెక్ట్ లాగా నమ్మి చేశారు. నల్లేరు మీద నడక లాగా వారితో షూటింగ్ సాగింది. బడ్జెట్ పరంగా చూస్తే ఇది ఇలాగే ఉండాలని మొదటే డిసైడ్ అయిపోయాము. రాజీ పడకుండా చేశాం. నేను ఎడిటింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాను… సినిమా డైరెక్టర్ కాకముందే అన్నిట్లో ఉన్నాను కాబట్టి మంచి అవగాహన ఉంది.
భగవంత్ కేసరి, లియో లాంటి భారీ చిత్రాలతో పోటీపడి రిలీజ్ చేయడం ఎందుకు?
మాది కూడా పెద్ద సినిమానే కదా.ఇది దసరా పండగ. బాలయ్య బాబు సినిమా కూడా బాగుండాలి. కాకపోతే టైమ్ అలా కుదిరింది. అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుంటా. మేం ముందే ఈ టైమ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. థియేటర్ల సమస్య కూడా మాకు ఎక్కడా ఏర్పడలేదు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
నుపూర్ సనన్ పాత్ర నిజంగా ఉందా?
స్టూవర్ట్ పురం చుట్టు పక్కల ప్రాంతాల్లో దొంగ బంగారం కొనటానికి మార్వాడీలు అక్కడ స్థిర పడ్డారు. ఆ మార్వాడీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో నాగేశ్వరరావుకు స్నేహం ఏర్పడింది. అదే నుపూర్ పాత్ర. అది నేను క్రియేట్ చేసిన పాత్ర కాదు నిజజీవితంలోనూ ఆమె ఉంది.
– హేమసుందర్