డేవిడ్ ఓ సెల్జ్నిక్- ఈ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ‘గాన్ విత్ ది విండ్’. ఆ సినిమాతో ఆయన ఆస్కార్ అవార్డు కొట్టేస్తే, ఆయన కున్న డ్రగ్స్ అలవాటులో ఆయనే కొట్టుకుపోయారు.
చేసే పని ఏదైనా ఆ వర్క్ ప్లేస్ ని దేవాలయంలా భావిస్తారు. దేవుడిని నమ్మని నాస్తికుడైనా అది పనికి ఇచ్చే పవిత్రత. కానీ కొందరు వర్క్ ప్లేస్ కి మద్యం తాగి వస్తుంటారు. మరి కొందరు వర్కింగ్ స్పాట్ లోనే డ్రగ్స్ తీసుకుని కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఆయన ఒక అగ్ర నిర్మాత. ఆ హాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని లబ్ధ ప్రతిష్టుడు. తీసిన సినిమాల్లో అధిక శాతం బ్లాక్ బస్టర్స్. రెండు సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా డ్రగ్ అడిక్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేక పోయాడు. ఇంకా చెప్పాలంటే షూటింగ్ స్పాట్ లో మత్తు మందు వేసుకుని నాకేవాడు. యూనిట్ అంతా షాక్ అయి చూస్తూండేది. అతను కేవలం నిర్మాతే కాదు రచయిత కూడా. అతని పేరు డేవిడ్ ఓ సెల్జ్నిక్ .
ఆయన తీసిన ఆ రెండు సినిమాలు క్లాసిక్స్
ఆ రెండు సినిమాలు గాన్ విత్ ది విండ్ (1930), రెబెక్కా-(1940) రెండు సినిమాలూ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నాయి. డేవిడ్ ఓ సెల్జ్నిక్ షూటింగ్ స్పాట్ లోనే డ్రగ్స్ తీసుకున్న సినిమా గాన్ విత్ ది విండ్. ప్రత్యక్షసాక్షి హీరోయిన్ ఎవెలిన్ కీస్ .. డేవిడ్ ఓ సెల్జ్నిక్ చిన్న వయసులోనే హాలీవుడ్ కి వచ్చేశారు ఎంజీఎం స్టూడియోస్ లో స్క్రిప్ట్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు అక్కడి నుంచి పారామౌంట్ పిక్చర్స్ ఆర్లో కే ఓ ప్రొడక్షన్స్ లో పని చేశారు. మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాల వరకు హిట్ సినిమాలను నిర్మాతగా అందించారు. ఆ దశలోనే డ్రగ్స్ కి బానిస అయ్యారు డేవిడ్. తమాషా ఏమిటంటే తన బాస్ కూతుర్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు డేవిడ్.
ఎంజీఎం అధినేత లూయిస్ బి. మేయర్ కుమార్తె ఐరెన్ గ్లేడిస్ మేయర్ ని1930లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 1945లో ఆవిడకి విడాకులు ఇచ్చేశాడు. తానే సొంతంగా నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. చాలా హిట్ సినిమాలు తీశాడు. గాన్ విత్ ది విండ్ నవలను కొని ఎవెలిన్ కీస్ హీరోయిన్ గా అదే పేరుతో సినిమా తీశాడు . తను డ్రగ్స్ కి బానిస కావడమే కాకుండా కొందరు టెక్నిషన్స్, ఆర్టిస్ట్ లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశాడు. కేవలం వాళ్లతో నిరవధికంగా 22 గంటలు పని చేయించడానికి డ్రగ్స్ అలవాటు చేసాడని అప్పట్లో చెప్పుకునేవారు.
‘ గాన్ విత్ ది విండ్’ షూటింగ్ స్పాట్ లో అయితే మత్తు మందుని అర చేతిలో నిలుపుకుని చేత్తో నాకే వాడని ఆ చిత్ర కథా నాయిక ఎవెలిన్ కీస్ చెప్పింది. గాన్ విత్ ది విండ్’ 1939 లో విడుదలై సూపర్ హిట్ అయింది. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఆ ఊపులో బ్రిటన్ కి పరిమితమైన మాస్టర్ అఫ్ థ్రిల్లర్స్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ని హాలీవుడ్ కి తీసుకొచ్చాడు డేవిడ్. హాలీవుడ్ లో హిచ్ కాక్ తీసిన ఆ మొట్టమెదటి సినిమా ‘ రెబెక్కా ‘ . హిచ్ కాక్ కెరీర్ లోనే ఆస్కార్ వచ్చిన ఒకే ఒక్క సినిమా ‘రెబెక్కా’.
ఆ సమయంలోనే హీరోయిన్ జెన్నిఫర్ జోన్స్ ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పుట్టిన కుమార్తె మేరీ జెన్నిఫర్ సెల్జ్నిక తన -22 వ ఏట ,20 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది . డేవిడ్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునే వాడు. ‘ది థర్డ్ మాన్ ’ సినిమా తీస్తూ ఆ డైరెక్టర్ కారల్ రీడ్ కి డ్రగ్స్ అలవాటు చేశాడు. క్లాసిక్ సినిమాలు తీసినా డ్రగ్స్ తాలూకు నరాల అనారోగ్యంతో ఎక్కువ టెన్షన్ పడుతుండే వాడు డేవిడ్. క్రమేపీ సినిమా నిర్మాణం మానేశాడు. తరచూ గుండె సంబంధిత వ్యాధికి లోనవుతుండేవాడు . చివరకి తన 63వ ఏట గుండెపోటుతో మరణించాడు. ఆస్కార్ స్థాయిలో పేరు తెచ్చుకున్నమత్తు మందుల బానిస అనే ముద్ర డేవిడ్ ని చనిపోయినా వదలలేదు.
-ప్రసాద్ తోట