ఓ ఆత్మ శరీరం నుంచి వేరు పడితే ఏమవుతుంది. జీవితంలో అతను కన్న కలలు నెరవేరటానికి అతని ఆత్మ ఏంచేసింది అనే విషయం ఎన్నోసార్లు తెరపైకి ఎక్కిందే. అయితే దీన్ని ఓ యానిమేషన్ రూపంలో చెబితే ఎలా ఉంటుంది. అలా రూపొందిన సినిమానే ‘సోల్’.
డిస్నీ పిక్సార్స్ నుంచి రూపొందిన ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే ఈ విషయంలో చిన్న మార్పు జరిగింది. ఇది నేరుగా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ చేయడానికి నిర్ణయం జరిగింది. ఇతర ఓటీటీలకు ధీటుగా ఉండేందుకు డిస్నీప్లస్ హాట్ స్టార్ తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. క్రేజీ ప్రాజెక్టులను నేరుగా ఓటీటీలోనే విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది.
డిస్నీ దూకుడు ఎలా కళ్లెం వేయాలా అని మిగతా ఓటీటీలు ఆలోచిస్తున్నాయి. ఆమేరకు వ్యూహాలు కూడా రచించుకుంటున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ సంగీత ఉపాధ్యాయుడు జో గార్డనర్ చిరకాల స్వప్నం నెరవేరిందా లేదా అన్నది. పాప్, జాజ్ లాంటి సంగీత కళ ప్రపంచాన్ని హోరెత్తిస్తున్న రోజులివి. అలా జాజ్ కళాకారుడిగా అతను రాణించాలనుకుంటాడు. ఈలోగా ఓ ప్రమాదం అతన్ని కబళిస్తుంది. అతని ఆత్మ శరీరం నుంచి వేరవుతుంది. జీవితంలో ఎదుగూ బొదుగూ లేని బ్యాండ్ కళాకారుడి కథ ఇది. ఓ పేరున్న జాజ్ క్లబ్‌లో చేరడమే అతని జీవితాశయం. అతను చేసిన ఓ చిన్న తప్పు అతన్ని న్యూయార్క్ నుంచి ఆత్మల లోకానికి తీసుకువెళుతుంది.
కొత్త ఆత్మలు భూమి పైకి వెళ్ళే ముందు వారి వ్యక్తిత్వాలు ఎలా ఉండాలో నేర్చుకునే అద్భుత ప్రదేశమది. మళ్లీ తన జీవితంలోకి అతను తిరిగి రావాలనుకుంటాడు. మరో ఆత్మతో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత ఏమవుతుందన్నది ‘సోల్’ చూస్తేగాని మనకు అర్థం కాదు. ఆస్కార్ అవార్డు పొందిన దర్శకుడు పీట్ డాక్టర్ హస్తం దీన్ని ఓ అపురూపం కళాఖండంగా మలిచింది. ఇందులో జామీ ఫాక్స్, టీనా ఫే, ఫిలిసియా రషద్, అహ్మీర్ క్వెస్ట్ వ్ థాంప్సన్, ఏంజెలా బాసెట్, డేవిడ్ డిగ్స్ తదితరులు నటించారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాకారుడు జోన్ బాటిస్టే తోనే జాజ్ సంగీతాన్ని ఈ సినిమా కోసం అందించడం విశేషం.
‘కదిలే యానిమేటెడ్ ఆత్మను పిక్సార్ అద్భుతంగా సృష్టించిందని, డిసెంబరులో డిస్నీ ప్లస్ నుంచి నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ డిస్నీ సీఈఓ బాబ్ చాపెక్ తెలిపారు. పిక్సర్ యానిమేషన్ స్టూడియో చీఫ్, క్రియేటివ్ ఆఫీసర్ డాక్టర్ మాట్లాడుతూ ‘మన జీవితంలో ముఖ్యమైంది ఏమిటనేది ఆత్మకే తెలుసు. ఈ సినిమా ప్రజలకు మంచి వినోదాన్ని అందిస్తుంది’ అని వివరించారు. ఈ సినిమా నిడివి 100 నిమిషాలు ఉంటుంది. దీని కోసం డిస్నీ చందాదారులు అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని కూడా లేదు. కాబట్టి మనముందుకు రాబోతున్నా ‘సోల్’ కోసం మనం ఎదురుచూడాల్సిందే.