ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకి అసమ్మతి సెగ తగిలిందా ? నియోజకవర్గ నేతల అసమ్మతి ఆయనకు తలనొప్పిగా మారిందా ? సిఎం నియోజకవర్గ లీడర్ల డామినేషన్ పై ఆ శాసన సభ్యుడు అసంతృప్తి చెందారా ? ఎమ్మెల్యే పై సొంత పార్టీలో రోజు రోజుకూ అసంతృప్తి పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి ? ఎమ్మెల్యే వైఖరి ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా మారుతోందా ? ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వరుస భేటీలలో తీసుకున్న నిర్ణయం ఏమిటి ? అసమ్మతి సెగతో రగిలిపోతున్న ఆ ఎమ్మెల్యే తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటి ?
జగన్ పార్టీలో భారీ మెజారిటీతో గెలిచిన ఆ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు. 2009 వరకు సివిల్ కాంట్రాక్టర్ గా ఉన్న ఆయన ప్రజారాజ్యంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కొంతకాలం ఆ పార్టీలో కొనసాగారు. ఇక 2014లో టిడిపి నుంచి బరిలో దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో అనూహ్యంగా వైసీపీలో చేరిన ఆయన గిద్దలూరు శాసన సభ్యుడిగా 80 వేల ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.
ఎన్నికల వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఎమ్మెల్యే అన్నాకు అసలు తలనొప్పులు మొదలయ్యాయట. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సిఎం జగన్ సామాజికవర్గ లీడర్ల డామినేషన్ ఎక్కువైపోవడం పట్ల అన్నా రాంబాబు అసంతృప్తితో ఉన్నారట.వారంతా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా తయారై ఎప్పటికప్పుడు గ్రూపులు కట్టి ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండడం అన్నాకు తలనొప్పిగా మారిందట.
మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కుతుందని ఎమ్మెల్యే అన్నా , ఆయన వర్గీయులు తెగ ఆశలు పెట్టుకున్నారట. ఆర్యవైశ్య సామాజికవర్గ కోటాలో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అని వైసీపీ ముఖ్యనేతలు సైతం ఊరించారట.. అయిట్ సిఎం జగన్ మాత్రం రాంబాబుకి హ్యాండ్ ఇవ్వడంతో అన్నా అసంతృప్తితో రగిలిపోతున్నారని టాక్.అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.ఈ కారణంగానే అన్నా రాంబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించడం లేదట.అదేసమయంలో గిద్దలూరులో జగన్ మూడేళ్ళ పాలన పై వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే రాంబాబు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట.
ఇక అభివృద్ధి పనుల విషయంలో సిఎం జగన్ ను కలిసినా సానుకూల స్పందన రాలేదట. దీంతో పార్టీ వ్యవహారం చూస్తుంటే ఎమ్మెల్యే పదవి పై ఆసక్తి పోయిందని పార్టీ పెద్దల ముఖ్యం మీదే చెప్పేశారట రాంబాబు.ఈ నేపధ్యంలోనే అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని.. ఈ విషయాన్ని తన అనుచరగానం వద్ద చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యవహారం పై వ్యతిరేక వర్గం వాదన మాత్రం మరోలా ఉంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేకి కార్యకర్తలకి మధ్య ఏర్పడిన గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతూ వచ్చిందని.. అదే నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణం అయ్యిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే వైఖరి నచ్చని కొందరు గ్రామ పార్టీ కార్యకర్తలు పార్టీని వేడుతున్నారని చెప్పుకుంటున్నారు.అందుకే ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ హై కమాండ్ కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట.
అదేసమయంలో వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా మారుతున్నాయనే చర్చ జోరందుకుంది. ఎమ్మెల్యే అన్నా వైఖరి నచ్చక కొందరు, వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకతతో మరికొందరు నాయకులు కార్యకర్తలు పార్టీని వీడి తెలుగుదేశంలోకి వలస పోతున్నారట. దీంతో నియోజకవర్గంలో టిడిపి మరింత బలంగా మారుతుండగా, వైసీపీ రోజు రోజుకీ పలచన పడిపోతోందట.
మొత్తం మీద నియోజకవర్గంలో తన రాజకీయ భావితవ్యానికి బీటలు పడుతున్నాయని గుర్తించిన ఎమ్మెల్యే అన్నా నిజంగా పార్టీని వీడతారా ? లేక అసమ్మతి వర్గాన్ని బుజ్జగిస్తారా ? అనేది వేచి చూడాలి..