ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పోలీసులను బానిసల్లా వాడుతోందని మండిపడ్డారు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. పోలీసులు చట్టం, న్యాయం , రాజ్యాంగాలను పక్కనబెట్టి వైకాపా నాయకులు ఏం చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.16 కేసుల్లో ప్రధమ నిందితుడిగా ఉన్న ఒక నేరగాడు గద్దెనెక్కి కూర్చుని ఆదేశాలు జారీ చేస్తుంటే.. పోలీసులు వాటికి అనుగుణంగా మిగితా రాజకీయ పార్టీల హక్కులను హరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సహనానికి ఒక హద్దు ఉంటుందన్న చంద్రబాబు.. పోలీసులు ఏం చేసినా భరించాలా అని అసహనం వ్యక్తం చేశారు.ఇదే ధోరణి కొనసాగితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని.. ఆరోజున తుపాకులు తూటాలు అడ్డుకోలేవని పోలీసులు గుర్తించాలని హెచ్చరించారు. ఒక డిజిపి పోయి మరో డిజిపి వచ్చినా రాష్ట్రంలో దిగజారిన పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదన్న ఆయన, బాధతో, ఆవేదనతో ఈ మాటలు అనాల్సి వస్తోందని అన్నారు.
టిడిపి నేతలు చనిపోతే పరామర్శించేందుకు కూడా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్లను చంపితే పరామర్శించే హక్కు మా పార్టీ నేతలకు లేదా? ఇళ్లలో మా పార్టీ నేతలను అక్రమంగా నిర్బంధించడానికి పోలీసు అధికారులకు ఉన్న హక్కేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్‌ను కిరాతకంగా చంపడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరిస్తుంటే డీజీపీ తన సీట్లో కూర్చుని ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు?
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు హత్యను పక్కదారి పట్టించడానికి కోనసీమలో చిచ్చు పెట్టారని బాబు విమర్శించారు.వైసీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు ఇష్టానుసారం కేసులు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాసులరెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డి వరుసగా చనిపోతే పోలీసు శాఖ ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు ? ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరిని చంపుతామని రోజూ బెదిరిస్తున్నారని.. సీబీఐ అధికారుల డ్రైవర్‌పై బాంబులు వేస్తామని బెదిరించారని అన్నారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు పెడితే ఆయ న హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవలసి వచ్చింది. నేరగాళ్లు రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నా సీబీఐకి పట్టదా’ అని నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం ఉందని, ఇప్పుడే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..