‘రికార్డు..’ ఈ మాట వింటే చాలు, ఎవరో ఏదో ఘనత సాధించారనే ఫీలింగ్ కలుతుంది. కానీ.. రికార్డు అనే నాణేనికి కూడా రెండు కోణాలుంటాయి. అద్భుతాలు నమోదు చేస్తూ ముందుకు సాగే రికార్డు ఒకటైతే.. దారుణమైన పరాభవాలు చవిచూస్తూ పాతాళానికి పడిపోయేది మరొకటి. ఇప్పుడు టీమిండియా జట్టు ఈ రెండో తరహా రికార్డు నమోదు చేసింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది మన జట్టు. ఈ అతి తక్కువ స్కోరుతో.. ప్రపంచ టెస్టు హిస్టరీలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన జట్టులో మనోళ్లు నాలుగో ప్లేసును ఆక్రమించి, సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. మరి, టీమిండియాను మించి చెత్త గేమ్ షో చేసిన వాళ్లెవరు..? మనోళ్ల తర్వాత చెత్త స్థానంలో నిలబడిందెవరు..? అనే వివరాలు చూద్దాం రండి..
ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత జట్టు.. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైంది. ఇందులో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. 36 పరుగులకే కుప్పకూలి దారుణ పరాభవాన్ని మూటగట్టుకోవడం మరో ఎత్తు. ఈ ప్రదర్శన ద్వారా.. టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరు (42)ను మరోసారి తిరగరాసింది టీమిండియా. ఈ మ్యాచ్ ద్వారా.. టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది మన జట్టు.
అత్యల్ప స్కోర్ కివీస్ దే…
1955 లో ఇంగ్లండ్‌పై కీవీస్ కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెుదటి ఇన్నింగ్స్‌లో కివిస్ 200 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 246 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ కివీస్ దారుణంగా విఫలమైంది. కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్‌కు మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండానే మ్యాచ్ గెలిచింది.
ఆ సమయంలో ఇంగ్లాండ్ దే హవా..
ఇంగ్లాండ్ డామినేషన్ స్పష్టంగా కొనసాగుతున్న సమయంలో ఇంగ్లాండ్, సఫారీల మధ్య జరిగిన టెస్ట్ మ్యా్చ్‌లో మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికా 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. కానీ ఇంగ్లిష్ బౌలర్ జార్జ్ లోహ్మాన్ దెబ్బకు సఫారీలు 30 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జార్జ్ ఆ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
30 పరుగులకే ఆలౌట్…
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మొత్తం 438 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో-ఆన్‌లోనే ఇంగ్లాండ్ 390 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది,
కుప్పకూలిన సఫారీ…
ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లోనూ సఫారీ జట్టు 35 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై ఇంగ్లాండ్ చేతిలో మరో ఓటమిని చవిచూసింది. స్కోఫీల్డ్ హైగ్, ఆల్బర్ట్ ట్రోట్ వరుసగా ఆరు, నాలుగు వికెట్లు తీసి ఆ జట్టును ఆలౌట్ చేశారు.
ఇంగ్లాండ్‌కు చేదు అనుభవం..
ఆసీస్‌తో ఆడిన మరో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ ఇలాంటి పరాజయాన్నే ఎదుర్కొంది. ఈ సిరీస్ ఇంగ్లాండ్‌కు తన క్రికెట్ కెరీర్‌లోనే చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారు ఆడిన రెండు ఇన్నింగ్స్‌లో కేవలం 81 పరుగులు మాత్రం చేసింది. ఆస్ట్రేలియా మాత్రం మెుదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది.
ఆసీస్ 36 పరుగులకే ఆలౌట్…
ఇరవయ్యవ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం ఎంతో కష్టమైన పని. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ దెబ్బను రుచిచూసింది. ఆ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ ఆసీస్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఆ మ్యాచ్ పూర్తి కాలేదు.. ఫలితంగా ఆ టెస్ట్ డ్రాగా ముగిసింది.











