ఏపీ ప్రజలను మరోసారి ఓటిఎస్ పేరుతో బాదేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వసూళ్లు మొదలు పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదివరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ పై ఉన్న బకాయిలకు ఓటిఎస్ కట్టాలంటూ వసూళ్లకు తెరలేపిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భ గనులు, అటవీ తదితర శాఖలలో బకాయిల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పన్ను బకాయిలను కూడా ఓటిఎస్ విధానంలో వసూలు చేయాలని సిఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాడేపల్లి కయ్యం కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. వీలైనంత ఎక్కువగా బకాయిలు వసూలు చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ, రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని వీలైనన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని.. టిడ్కోకు సంబంధించిన రిజిస్ట్రేషన్లనూ పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
వాణిజ్య పన్నుల శాఖలో సమర్ధతలను పెంపొందించుకోవడానికి అధికారులు చేసిన కొన్ని ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టతతోపాటు, డాటా అనలిటిక్స్ విభాగం ఏర్పాటు, లీగల్ సెల్ ఏర్పాటు, బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం కల్పించనున్నారు.