చెడుపై మంచి సాధించిన విజయాన్నే మనం దీపావళిగా జరుపుకుంటాము. ఈ దీపావళి మనకు పూర్తి భిన్నం. గతంలో మనం జరుపుకున్న దీపావళి పండుగకు ఇప్పుడు జరుపుకుంటున్న దీపావళి పండుగకు చాలా వ్యత్యాసం ఉంది. ఇలా ఎందుకు అంటుంన్నానంటే.. ఈసారి కరోనా వైరస్ ముప్పు మధ్య దీపావళి పండుగను కాస్త భయం భయంగాను.. కాస్త సంతోషంగాను.. కాస్త జాగ్రత్తగాను జరుపుకుంటున్నాం. అందుకే ఈ దీపావళి గత దీపావళి పండుగల కంటే ప్రత్యేకమైనది, పూర్తి భిన్నమైనది. అందరితో కలిసిమెలసి.. ఆనందంగా ఉంటూ అందరు బాగుండాలని, అందులో మనం ఉండాలని, ఈ కరోనా ముప్పు తొలగాలని రాబోయే రోజుల్లో జీవితం సంతోషంగా సాగిపోవాలంటూ ఈ దీపావళి జరుపుకుందాం.
మంచిపై విజయమే దీపావళి…
చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిగా జరుపుకుంటామని చాలాా కథలే ఉన్నాయి. విష్ణుమూర్తి, భూదేవి కుమారుడు భౌముడు. ప్రాగ్జోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని భౌముడు పరిపాలప చేస్తుంటాడు. భౌముడి పరిపాలన నరకప్రాయంగా, క్రూరంగా మారడంతో అతనికి నరకాసురుడు అనే పేరు వచ్చింది. అయితే ఈ నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ వధించారని కథలు కథలుగా చెప్తారు. నరకాసురుడి చెర నుంచి ఇలా ప్రజలు విముక్తి పొందడంతో దీపాలు వెలిగించి సంబురాలు జరుపుకుంటారని పెద్దలు చెప్తుంటారు. అప్పటి నుంచి ప్రతీ ఆశ్వయుజమాసంలో నరక చతుర్థి రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళికి సంబంధించిన ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొలా చెబుతుంటారు. కానీ ప్రతి కథలోనూ చెడుపై మంచి సాధించినందుకే దీపావళిని జరుపుకుంటామని నీతి ప్రతి కథలో ఉంటుంది.
కరోనా అనే చెడుపై విజయం అవసరం..
చెడుపై విజయం అవసరం మనకిప్పుడు. దాదాపు 11 నెలలు కావొస్తోంది కారోనా బారిన ప్రపంచమంతా పడి. కరోనా వైరస్ అనే చెడుపై దేశం, ప్రపంచం సాధించాల్సిన విజయం కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయం కోసం కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా? ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధించే శక్తిని మాకు ప్రసాధించు అని భగవంతున్ని కోరుకుంటున్నారు. కరోనాను ధీటుగా ఎదుర్కొనెలా యావత్ మానవ జాతికి చెడుపై మంచి విజయాన్ని చేకూర్చు దేవా అని ఈ పండుగ రోజు ప్రార్ధిద్దాం. కరోనా అనే చెడుపై విజయాన్ని తమకు ఇవ్వాలని కోరుకుందాం. వచ్చే దీపావళి అయినా ఈ కరోనా భయం లేకుండా, సంతోషంగా, ఆనందంగా అందరం జరుపుకునేలా ఆ భగవంతున్ని కోరుకుందాం.
దీపాల అలంకరణ..
ఈసారి టపాసుల మోత కాస్త తగ్గినా కానీ ఇళ్లంతా దీపాలతో అలంకరణ ఏమాత్రం తగ్గదు. మట్టిప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగస్తారు. దీప అంటే దీపమని, అవళి అంటే వరుస అని అర్ధం. దీపాల వరుసనే దీపావళి అంటారు. ఈ పర్వదినాన ఇంట్లో లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతారు. చీకటి పడగానే అందరింటా ఈ దీపాలు కలకలలాడుతూ వెలుగుతుంటాయి.