కమలహాసన్ .. కొత్తదనానికి మరోపేరు .. ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్. కథానాయకుడిగా సుదీర్ఘమైన తన ప్రయాణంలో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు వేరెవరూ చేయలేదనే చెప్పాలి. వయసు పెరుగుతున్నా కొత్త దనం నుంచి ఆయన కొంత దూరం కూడా జరగలేదు. తను ఆసక్తిని చూపిన ప్రయోగాత్మక కథలు రిస్క్ అని నిర్మాతలు భావించినప్పుడు, తనే నిర్మాతగా మారిన సందర్భాలు అనేకం వున్నాయి. తాజాగా ఆయన బ్యానర్ పై మరో సినిమా నిర్మితమవుతోంది .. ఆ సినిమా పేరే ‘విక్రమ్’.
ఓటీటీలో ఏమేం విడుదలవుతున్నాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
విభిన్నమైన కథాకథనాలతో సాగే ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. తమిళంలో సందీప్ కిషన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మానగరం'(నగరం) యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక కార్తీ కథానాయకుడిగా ఆయన చేసిన ‘ఖైదీ’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. కథాపరంగా ఈ రెండు సినిమాలను రాత్రివేళల్లోనే చిత్రీకరించారు. అదే ఆ సినిమాలకి ప్రధానబలంగా నిలిచింది కూడా.
అలాగే ‘విక్రమ్’ కథ కూడా రాత్రి సమయాల్లోనే సాగుతుందట. అందువలన రాత్రివేళలోనే షూటింగును జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. అనిరుథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక లోకేశ్ కనగరాజ్ తాజా చిత్రమైన ‘మాస్టర్’ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.











