బీజేపీ రాష్ట్ర నాయకత్వం దుబ్బాక ఉప ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించింది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ రెండో సారి పగ్గాలు చేపట్టాక, సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి చనిపోయాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో, గెలుపు అంత ఈజీ కాదని, కానీ ప్రయత్నిస్తే గెలుపు సాధ్యమే అంటోంది బీజేపీ అధిష్ఠానం. ఇప్పటికే బీజేపీ శ్రేణులు మండలాలు, గ్రామాలు, డివిజన్ ల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు దుబ్బాకలోనే తిష్టవేసుకుని కూర్చుని మరీ ప్రచార కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ సారి దుబ్బాకాలో గెలుపు ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రకటనకు ముందే ప్రచారం…
ఇప్పటికే దుబ్బాక నుంచి పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు .. దుబ్బాక అభివృద్ధి విషయంగా కేసీఆర్, హరీష్ రావులు దుబ్బాకను నిర్లక్ష్యం చేశారన్న ప్రచారాన్ని ప్రజల్లో బలంగా నాటేలా ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందున్న భావనలో రఘునందన్ రావు సైతం ప్రజల్లోకి బలంగా దూసుకు పోతున్నారు. పదునైన విమర్శలతో ప్రజల దృష్టిని ఆకర్షి స్తున్నారు.
తనకు ఒక సారి అవకాశం ఇస్తే దుబ్బాక రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తానంటున్నారు. రామలింగారెడ్డిని గెలిపించుకున్నా, ఎన్నో అవకాశాలు ఇచ్చినా నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదంటూ రఘునందన్ రావు ప్రజలకు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలను తమవిగా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను టీఆర్ఎస్ మోసం చేస్తోందంటూ గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాష్ట్రనాయకత్వం భావిస్తోంది.
ఇంతకూ అభ్యర్థి ఎవరో…
ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా అభ్యర్థి ప్రకటనలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతినే కొనసాగిస్తోంది బీజేపీ . తానే అభ్యర్థి అన్నట్టు రఘునందన్ రావ్ ప్రచారం చేసుకుంటుండగా … పార్టీ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు. జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నాకే అభ్యర్థి ప్రకటన ఉంటుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.
జితేందర్ రెడ్డి సారథ్యంలో…
ఇక దుబ్బాకలో ఎన్నికల వ్యవహారాలు చూసుకునేందుకు మాజీ ఎంపీ జిత్తేందర్ రెడ్డికి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో బీజేపీ ఈ ఎన్నికలపై ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తోందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ ఎన్నికల ప్రభావం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుందన్న భావనలో ఉన్న బీజేపీ, దుబ్బాక టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఆ సీటు గెలిచి తీరాలన్న కసితో చేస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.











