గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. వర్షానికి రోడ్లు పూర్తిగా కోట్టుకు పోయాయి. వందలాది కాలనీలు నీట మునిగాయి . ఒక్కసారిగా భారీ వరద చుట్టుముట్టడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు వెళ్లదీసారు నగర వాసులు. పదుల సంఖ్యలో చెరువులు కట్టలు దిగిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు , బైక్ లు ఇలా అన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకు పోయి పరిస్థితి బీభత్సంగా తయారైంది. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడిపోయిన వాహనాలే దర్శనమిస్తున్నాయి.
ఇక వర్షాలు కొన్ని కుటుంబాలలో తీరని విషాదం నింపాయి. కొన్ని చోట్ల కుటుంబాలకు కుటుంబాలే వరద నీటిలో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల తడిసిముద్దయిన గోడలుకూలి ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడ్డారు. ఇక ఒక్కసారిగా పెరిగిన వరద కారణంగా ఏం జరుగుతుందో తెలిసే లోపే ఆ వరదలకు బలయ్యారు నగర వాసులు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ కొంత మంది… గమ్యస్థానాలకు చేరుతూ మరికొంత మంది.. ఇళ్లలో నిద్రిస్తూనే మరింత మంది ఇలా తమ విలువైన ప్రాణాలకు కోల్పోయారు. చికటిలో కురిసిన భారీ వర్షం తెల్లారే సరికి ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చింది. రాత్రి పడుకున్న వారు ఉదయం లేచి చేసే సరికి వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో 11 మంది చనిపోతే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 మంది చనిపోయారని తేల్చింది.
అయితే అనధికారంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లముందే పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో చిక్కుకుని కొట్టుకు పోయారు. అలాంటిది రాత్రికి రాత్రే పెరిగిన వరద ఉధృతి ఎంతమందిని బలి తీసుకుని ఉంటుందో.. తలుచుకుంటేనే వల్లు జలదరిస్తోంది.
ఇప్పడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వరద తీవ్రత తగ్గుమొహం పట్టడంతో విగతజీవులుగా మారిన వారి శవాలు బయట పడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఈ శవాలు బయట పడుతుండటంతో ఆక్కడి ప్రజల్లో భయాందోళలు చలరేగుతున్నాయి. ఏ రోజు ఏ వాగులో ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడురోజుల క్రితం సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్టలు తెగి వాహనాలపై వెళ్తున్న వారిని అమాంతం మింగేసాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అనేక ప్రాతాల్లో రోడ్లపైకి నీరు వచ్చింది. దీంతో వరదల్లో వందల సంఖ్యలో కొట్టుకు పోయిన వాహనాలు బయపడుతున్నాయి. వీటిల్లో మనుషులు ప్రయాణం చేస్తున్నారా.. పార్కింగ్ లో ఉన్న వాహనాలే కొట్టుకు పోయాయా తెలియని పరిస్థితి. జాతీయ రహదారులపైనా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాహనాలు కొట్టుకు పోయాయి… వాటిలో మనుషులు ఉన్నారా లేరా.. ఉంటే ఎటు పోయారు. మనుషులు లేక పోతే అవి ఎక్కడ నుండి కొట్టుకు వచ్చాయన్న విషయాలు తేలాల్సి ఉంది. ఈ వివరాలు తెలిస్తే గాని తాజాగా కురిసిన వర్షాల కారణంగా ఎంత మంది బలయ్యారో లెక్కతేలని పరిస్థితి .
ఇక నగరంలో ఓల్డ్ సిటీలో పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారింది. చూస్తూ ఉండగానే ఓ వ్యక్తి వరదల్లో కోట్టుకు పోవడం.. సహాయక చర్యలో బోటు పల్టీకొట్టడం వంటి ఘటనలు కళ్ళముందే జరిగాయి. మరి ఇరుకైన ఇళ్ల మధ్య నుండి ప్రవహించిన వరద నీరు మరెంత మందిని బలి తీసుకుంది… ఎన్ని ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి.. ఎక్కడో ఉన్న తమ వారు తిరిగి వస్తారని ఫిర్యాదులు ఇవ్వకుండా ఎదురు చూస్తున్న కుటుంబాలెన్ని ఇవన్ని సమాధానం దొరకని ప్రశ్నలే. వరదల కారణంగా మరెవ్వరూ బలికాకుడదు.. అందరూ క్షేమంగా ఉండాలంటూ ఆ దేవుణ్ని ప్రార్థిద్దాం… జరగరానిది జరిగి కుటుంబానికి ఎవరైనా దూరమైతే వారికి అండగా తోడుగా నిలబడదాం.











