దుబ్బాక ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని అక్కడ ఆ స్థాయిలో చేశారు మరి. అరెస్టులు, ఆరోపణలు, దాడులు, తనిఖీలు ఇలా ఎన్నడూ లేనంతగా ఉప ఎన్నిక ఒక సంగ్రామాన్నే తలపించింది. అయితే మంగళవారం ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. దుబ్బాకలో దుబ్బరేపేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గెలిచేది ఎవరు? అనే చర్చ అప్పుడే మొదలైంది. మరోవైపు బెట్టింగులు కూడా కాసుకుంటున్నారు.
ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్‌లో 200 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు. దుబ్బాకలో మొత్తం 1,98,756 ఓట్లు ఉంటే ఇందులో పోలైన ఓట్లు 1,64,192 ఉన్నాయి. ఈ ఎన్నికలో మొత్తం 23 అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నెలకొనే అవకాశం ఉంది. ఇరు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ ఫలిస్తుందా? లేక బీజేపీ ఆశలు చిగురించనున్నయా అనేది తేలడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలుంది.
హరీష్‌రావు ప్రచారం, కేసీఆర్ చరిష్మా, ఉప ఎన్నికల సెంటిమెంట్‌పైన టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆశలు పెట్టుకుంటే, 82శాతం నమోదైన పోలింగ్, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల్లో రఘునందన్‌రావుపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్‌పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎవరి స్ట్రాటజీ వర్కవుటవుతుందో చూడాల్సి ఉంది. గెలుపోటముల మధ్య స్వల్ప మెజార్టీయే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 23 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన రెండు గంటల్లో ఎవరు గెలుస్తారనే ఓ అంచనాకు రావొచ్చు. అయితే ఒక ఎగ్జిట్ పోల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని, మరొక ఎగ్జిట్ పోల్లో బీజేపీ గెలుస్తుందని మిశ్రమ ఫలితాలను చూపించడం ఇంకా ఎక్కువ ఉత్కంఠకు దారితీస్తుంది.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికను ఈ మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి. ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నాగాని రేపు 12 గంటల్లోపు గెలిచేది ఎవరో దాదాపు ఖరారు అవుతుంది. అప్పటి దాకా వెయిట్ అండ్ సీ.