( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
నీతి, నిజాయితీ, మానవ హక్కులు, రాజ్యాంగం, నైతిక విలువలు.. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు… ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు లేకుంటే పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.
నిజమే, నిజమే… వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులు ప్రచారం చేస్తున్నట్టు రాష్ట్రంలో కోర్టులు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు… మానవ హక్కులను హరిస్తున్నప్పుడు… కోర్టులు జోక్యం సహజం. అనేక విషయాల్లో ప్రభుత్వం తీరును కోర్టులు తప్పు పడుతున్నాయంటే… అందుకు కారణం వేరేగా చెప్పనవసరం లేదు.
ఇప్పటి వరకు ఏ స్థాయి వ్యక్తి అయినా… ఎంత హోదా ఉన్నా.. కోర్టు తీర్పులకు లోబడి ప్రవర్తించేవారు. కోర్టు తీర్పులు పై కామెంట్ చేసేందుకు భయపడేవారు. కానీ ఇవన్నీ గత ప్రభుత్వంతోనే పోయాయి. కొత్త ప్రభుత్వంలో అన్నీ కొత్త పోకడలే. ఒకటి కాదు రెండు కాదు… ఆంగ్ల విద్య.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్… నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్… పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ.. మూడు రాజధానులు అంశం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి విషయంలోనూ కోర్టు జోక్యంతోనే ప్రభుత్వం దూకుడుకు కళ్లెం పడుతోంది. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారిని నిలువరించే ధైర్యం ప్రతిపక్ష నేతల్లో కనిపించడం లేదు. ఒకవేళ సాహసించినా, కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసి వెనకడుగు వేసేలా చేస్తున్నారు.
ఆదేశాల అమలులో వ్యంగ్యం..
వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో సచివాలయం కట్టొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే, సచివాలయం కాకుండా రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులను ప్రారంభించారు. మీరు అది కట్టొద్దు అన్నారు కానీ.. అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయమూర్తులు కోర్టు ఆదేశాలను అపహాస్యం చేస్తారా? అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 215 ప్రకారం సుమోటోగా తీసుకుని అధికారులపై చర్యలు తీసుకునే హక్కు ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని విషయాల గురించి తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఇదొక్కటే కాదు… అనేక విషయాల్లో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఆక్రమణ కూల్చివేతపై విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, తొలగింపునకు నోటీసులు జారీ చేశారు.
ప్రతిపక్షాలపై ఉక్కు పాదం..
సాధారణంగా ప్రభుత్వం… రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ఆయా పార్టీల నాయకులు ప్రజల తరఫున పోరాటం చేస్తారు. కానీ ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే… గొంతు కోసే పరిస్థితులు ఉన్నాయి. దీంతో తప్పని తెలిసినా… కిమ్మన లేని దయనీయ స్థితిలో ప్రతిపక్ష నేతలు కాలం గడుపుతున్నారు. బాధితులు, తమ హక్కులను కాపాడుకోవాలని అనుకునేవారు… తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు గడప తొక్క వలసి వస్తోంది. కోర్టులు తప్ప ప్రభుత్వ దూకుడు నిలువరించే మరో శక్తి రాష్ట్రంలో లేకపోవడంతో… అర్హత ఉన్నా లేకున్నా.. స్థాయి ఉన్నా లేకున్నా… న్యాయం కోసం కోర్టు గుమ్మం తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. అప్పటికి పాలకుల వైఖరిలో మార్పు కనిపించకపోవడం శోచనీయం. పైగా, వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నందుకు… చివరకు జడ్జీల పైన ఒత్తిడి పెంచేందుకు వారిపైనా ఫిర్యాదుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిజంగా రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లేకుంటే… సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు ఏమైపోయేవారో!











