విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈనెల 16న ప్రారంభించాలని ప్రభుత్వం మరో సారి నిర్ణయించింది. ఈసారైనా ఆటంకాలు లేకుండా దుర్గగుడి పైవంతెన అందుబాటులోకి వస్తుందా? అని బెజవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ పనులు ఐదేళ్లు సాగాయి. నత్తతో పోటీ పడీ… పడీ ఎట్టకేలకు పూర్తి చేశారు. వివిధ కారణాలతో వాయిదా వేశారు.
రెండు సార్లు సరే…మూడో సారీ..?
ఇప్పటికే దుర్గగుడి పైవంతెన ప్రారంభోత్సవం రెండు సార్లు వాయిదా పడింది. మొదటి సారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో వాయిదా వేశారు. ఆ తరవాత కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడింది. మూడో ముహూర్తంగా ఈ నెల 16న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సారైనా ముడిపడుతుందా ఏవైనా ఆటంకాలా వస్తాయా అని బెజవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు.
పైవంతెనతో…సజావుగా ట్రాఫిక్…
దుర్గగుడి పైవంతెన ప్రారంభం అయితే ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తొలగనున్నాయి. దుర్గగుడిలో ఈనెల 17 నుంచి దసరా ఉత్సవాలు కూడా ఉండటంతో, పైవంతెన ప్రారంభిస్తే భక్తులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకూ…ఎవరి పేరో..?
ఫ్లైఓవర్ పనులు ప్రారంభించినప్పటి నుంచీ బెజవాడవాసులు దుర్గగుడి ఫ్లైఓవర్ గా పిలుచుకుంటున్నారు. దుర్గమ్మ పేరు పెడితే విజయవాడ ప్రజలే కాదు, అమ్మవారి భక్తులు కూడా సంతోషిస్తారు. అయితే ప్రభుత్వ మదిలో ఈ వంతెన పేరు మార్చాలని ఉందట. అయితే అమ్మవారి పేరు మార్చడానికి సాహసం చేయలేక పోతున్నారని తెలుస్తోంది. దుర్గగుడి వంతెనకు అమ్మవారి పేరు మార్చితే ఏదైనా కీడు జరగుతుందేమోనని పాలకులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే దుర్గగుడి వంతెనగానే నామకరణం చేస్తారని సమాచారం.











