2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ సర్కారు హ్యాట్రిక్ కొట్టిందని పలు విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఏపీలో టీడీపీ కూటమి గెలుపు ఈవీఎంల మహిమేనని విపక్ష వైసీపీ నిత్యం చెబుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే అవసరం ఉన్నా, లేకపోయినా… ఈవీఎంల అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇటీవలి హర్యానా ఎన్నికల ఫలితాలపై తాను స్పందించాల్సిన అవసరం లేకున్నా కూడా.. ఏపీలో మాదిరే హర్యానాలోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక వైసీపీకి వత్తాసు పలుకుతున్న ప్రముఖ ఎగ్జిట్ పోల్ నిపుణుడు ఆరా మస్తాన్ అయితే… ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం సులభమేనని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తామంటూ కొందరు తనను సంప్రదించి… తనకు డెమో కూడా చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కూడా ఆయన ఆరోపించారు.
తాజాగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్… ఈవీఎంల ట్యాంపరింగ్ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఆయన తెలిపారు.ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ తరహా ఆరోపణలు ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసే సంస్థల నుంచి వస్తున్నాయన్న ఆయన… అసలు ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనని తెలిపారు. తమ అంచనాలు తప్పనింత మాత్రాన ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యారని ఆయా సంస్థలు ఆరోపించడం సబబు కాదని ఆయన అన్నారు.
దేశంలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందుగానే ఈవీఎంల తయారీ మొదలవుతుందని ఆయన తెలిపారు. ఎన్నికలకు కేవలం 5 రోజుల ముందు మాత్రమే బ్యాటరీలను అమర్చుతామన్నారు. ఇక మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు. ఇంత పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ జరిగితే… ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయని ఇకపై వచ్చే ఆరోపణలపై కఠువుగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.