వైసీపీ అధికారంలో ఉండగా… అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తున్నారు కదా. టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు జైలు శిక్ష పడేలా కోర్టు ముందు వాదనలు వినిపించింది తానేనని పొన్నవోలు జబ్బలు చరుచుకున్న దృశ్యం కూడా జనానికి గుర్తు ఉండే ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ లో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేయగా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆ శాఖ చంద్రబాబును అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ లో ప్రభుత్వ తప్పేమీ లేదని నిరూపించేందుకు నాడు సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ తో కలిసి పొన్నవోలు ఢిల్లీ వేదికగా వినిపించిన వాదనలు ఎంత డొల్లగా ఉన్నాయో కూడా ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది.
అయినా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించిన ప్రస్తావన ఎందుకంటారా?…తానో సమర్థవంతమైన న్యాయవాదినని చెప్పుకునే పొన్నవోలు తన పిటిషన్ పై మాత్రం ఆ తరహా వాదనలు వినిపించలేకపోయారు. వెరసి ఏపీ హైకోర్టులో ఆయన అభాసుపాలయ్యారు. వైసీపీ ప్రభుత్వం తరఫున కీలక కేసుల్లో సత్తా చాటానని చెప్పుకునే పొన్నవోలు జగన్ జమానాలో ఏకంగా సెక్యూరిటీని కూడా పొందారు. వైసీపీ పాలనకు చరమ గీతం పాడుతూ టీడీపీ కూటమి రికార్డు విక్టరీతో నూతన సర్కారును ఏర్పాటు చేసింది. మరుక్షణమే పొన్నవోలు పదవి కూడా ఊడింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలుకు పంపడంలో తానే కీలక భూమిక పోషించానన్న భావనలో ఉన్న ఆయన ఇటీవలే ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహానీ ఉందని, ఈ కారణంగా తనకు భద్రతను కల్పించాలని సదరు పిటిషన్ లో పొన్నవోలు కోర్టును అభ్యర్థించారు. దీనిపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పొన్నవోలు వాదనలు విన్న హైకోర్టు… పొన్నవోలుకు ప్రాణహానీ ఉందని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పొన్నవోలు పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతగా భద్రత కావాలనుకుంటే… సొంత ఖర్చులతో పొన్నవోలు భద్రతను కోరుకుంటే… వన్ ప్లస్ వన్ పద్దతిన భద్రతను కల్పించేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది.