సత్తా కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావు… గడచిన ఐదేళ్లలో నానా ఇబ్బందులు పడ్డారు. చేయని పొరపాటుకు ఆయన తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. ఏకంగా ఐదేళ్ల పాటు సర్వీస్ ను కోల్పోయారు. రిటైర్మెంట్ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ సర్కారు పోస్టింగ్ ఇవ్వగా… అదే రోజు ఆయన పదవీ విరమణ పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చేదాకా వివిధ హోదాల్లో పనిచేసిన ఏబీవీ మచ్చ లేని ఖాకీగానే కాకుండా ఐపీఎస్ లలోనే మేలిమి వజ్రం లాంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ ఏ హోదాలో పనిచేసినా… తనదైన మార్కు పనితీరుతో ఏబీవీ రాణించారు.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే… అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్ను ఏబీవీపై పడింది. అంతకుముందు టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీవీ… తనకు ఎదురైన కష్టాలన్నింటి కారణమని జగన్ భావించారు. ఈ కారణంగా వైసీపీ పాలన మొదలయ్యాక ఏబీవీకి అసలు పోస్టింగే దక్కలేదు. అంతేనా… వైసీపీ పాలన మొదలైన 6 నెలలకు ఏకంగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేసిన ఏబీవీ… తనపైనా, తన పార్టీపైనా నిఘా ఉంచారని జగన్ భావించారు. అవే ఆరోపణలతో ఏబీవీపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణను ఏబీవీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కింది స్థాయి కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా సాగిన ఈ కేసుల విచారణలో నాటి సర్కారు ఒక్కటంటే ఆధారాన్ని కూడా చూపలేకపోయింది.
కోర్టుల్లో కేసులు వీడిపోవడంతో ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పావులుగా వాడుకున్న జగన్ సర్కారు ఏబీవీకి పోస్టింగ్మ ఇచ్చేందుకు ససేమిరా అన్నది. వెరసి జగన్ కక్షసాధింపు చర్యల కారణంగా ఐదేళ్ల పాటు తన విలువైన సర్వీస్ ను ఏబీవీ కోల్పోయారు. ఇక ఏబీవీ రిటైర్మెంట్ దగ్గర పడగా… సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే… ఎక్కడ తన ప్రాణానికి చుట్టుకుంటుందోనన్న భయం నాటి ఏపీ సీఎస్ ను వెంటాడింది. దీంతో రిటైర్మెంట్ రోజున ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చారు. ఫలితంగా అలా పోస్టింగ్ లో జాయిన్ అయిన ఏబీవీ ఇలా రిటైర్ అయిపోయారు.
తాజాగా టీడీపీ కూటమి సర్కారు ఈ వ్యవహారంపై దృష్టి సారించి.. కోర్టుల్లో గత ప్రభుత్వం ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపలేకపోయిందని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఏబీవీపై నమోదైన 3 కేసుల్లో 2 కేసులను ఉపసంహరించుకుంది. మరో కేసు ఉపసంహరణకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్దకు చేరినట్టు సమాచారం.