తబ్లిగి జమాత్‌పై వస్తున్న మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బుధవారం రాత్రి దేశవ్యాప్తంగా వారి కార్యాలయాలపై సోదాలు ప్రారంభించారు. ఢిల్లీలో 7 చోట్ల, ముంబాయిలో 5 చోట్ల, హైదరాబాదులో 4, కేరళలో 3 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాదు మల్లేపల్లి ప్రాంతంలో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలకు సంబంధించి ఆధారాలకోసం వెతుకుతున్నారు. దేశవ్యాప్తంగా మతపరమైన వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు వెచ్చించే నిధులు ఎక్కడినుంచి వచ్చాయో సేకరిస్తున్నారు.
తబ్లిగి జమాద్ నిర్వాహకులపైన ఏప్రిల్ లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కూడా కేసులు నమోదు అయ్యాయి.
ముస్లిం వర్గాల్లో అసహనం
మోడీ సర్కారు ముస్లిం సమాజం పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఆ వర్గం నుంచి వెల్లువలా వస్తున్నాయి. కోవిడ్ ప్రబలుతున్న తరుణంలో.. కేవలం తబ్లిగి జమాత్ వల్లనే దేశమంతా వ్యాపించినట్లుగా రంగుపులిమి దుష్ప్రచారం చేయడంలో మోడీ సర్కారు సఫలమైందని.. ఇప్పుడు మళ్లీ ముస్లిం సమాజంలో భయాందోళనలు పెంచేలా.. ఇలాంటి ఈడీ దాడులకు తెగబడుతోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.