ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అనే కీలకమైన పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నరు ఆమోదముద్ర కూడా వేసేసిన తర్వాత.. ప్రస్తుతానికి చేయగలిగేదేమీ లేదు. అయితే దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా ‘రెఫరెండం’ అనే మాట తెరమీదకు తెస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ నాయకులతో పాటు, వైసీపీలో తిరుగుబాటు చేస్తున్న నాయకులు కూడా ప్రజాభిప్రాయం సేకరించాలని అంటున్నారు.
‘రెఫరెండం’, ‘ప్లెబిసైట్’… పదాలు ఏవైనప్పటికీ.. వాటి లక్ష్యం మాత్రం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం. ప్రభుత్వాలు ఎన్నికయ్యేది ప్రజాభిప్రాయం మేరకే కదా.. అనే అనుమానం మనకు రావొచ్చు. కానీ.. ఒకసారి ఎన్నికైన తర్వాత, సదరు ప్రభుత్వాలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తే గనుక.. అప్పుడు విపక్షాలు, తటస్థులు కూడా రెఫరెండం కోసం డిమాండ్ చేయడం కద్దు. అయితే ఇలాంటి రెఫరెండంలు మన దేశంలో చాలా తక్కువ.
ఎన్నికైన ప్రభుత్వం మళ్లీ ప్రజాభిప్రాయానికి వెళ్లడం- అంటేనే ఒక రకంగా తమ ఓటమిని ఒప్పుకున్నట్టు, తమ నిర్ణయం మీద సందేహం ఉందని అంగీకరించినట్టు అవుతుంది. అంత సహృదయంతో, తమ నిర్ణయాల మీద ప్రగాఢమైన నమ్మకంతో వ్యవహరించే పార్టీలు మన దేశంలో లేవు. ఎవరైనా రెఫరెండం డిమాండ్ చేస్తే.. ‘ఓకే.. రెఫరెండం పెట్టడానికి మేం సిద్ధం.. మా నిర్ణయానికి ప్రజామోదం ఉందని నిరూపించుకుంటాం’ అని దమ్ముగా చెప్పగల ప్రభుత్వాలు మనకు లేవు. అందుకే మన దేశంలో రెఫరెండం జరిగే సందర్భాలు అతి తక్కువగానే లెక్కతేలుతున్నాయి.
చరిత్రలోకి చూస్తే…
బ్రిటిష్ రాజ్ నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తున్న సమయంలో మూడు రెఫరెండంలు జరిగాయి. పాకిస్తాన్ విడిపోయినప్పుడు.. ఈ మూడూ కూడా… ఇటు ఇండియాలో చేరాలా? అటు పాకిస్తాన్‌లో చేరాలా? అనే విషయం మీదే కావడం విశేషం. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ గా పరిగణనలో ఉన్న ప్రాంతంలో ఒక రెఫరెండం నిర్వహించారు. పెషావర్ కేంద్రంగా హజారా, కోహత్, మర్దన్ తదితర డివిజన్లను కలుపుకుని ఉండే ఈ ప్రావిన్స్ ఇటు పంజాబ్‌ను, అటు ఆఫ్గనిస్తాన్‌ను అంటుకుని ఉండేది. ఈ ప్రావిన్స్‌లో రెఫరెండం నిర్వహించినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి ఖాన్ అబ్దుల్ జబ్బార్ ఖాన్ ఆధ్వర్యంలోని వారందరూ ఆ రెఫరెండంను నిరసించి అందులో పాల్గొనలేదు. కేవలం భారత్, పాకిస్తాన్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారని, స్వతంత్రంగా ఉండడానికి గానీ, అటు ఆఫ్గనిస్తాన్‌లో చేరడానికి గానీ ఆప్షన్స్ ఇచ్చి ఉండాలనేది వారి వాదన. ఆ ప్రావిన్స్‌ను ఇప్పుడు ఖైబర్ ఫఖ్తున్‌క్వా అని పిలుస్తున్నారు. మొత్తానికి ఆ రెఫరెండం తీర్పు ద్వారా ఆ ప్రావిన్స్ పాకి్స్తాన్ లో కలిసింది. అలాగే అప్పటికి అసోంలో భాగంగా ఉన్న సిల్హెట్ ప్రాంతంలో కూడా ఇదే తరహా రెఫరెండం నిర్వహించారు. వారు కూడా ఈస్ట్ పాకిస్తాన్‌గా అప్పటికి పరిగణనలో ఉన్న బంగ్లాదేశ్‌లోనే కలిసిపోయారు. అలాగే అన్నివైపుల భారత భూభాగం ఉన్న జునాగఢ్ ను పాలిస్తున్న అప్పటి నవాబు, పాకిస్తాన్ లో కలవడానికి సుముఖంగా ఉన్నప్పటికీ.. అక్కడి పౌరుల నిరసనల నేపథ్యంలో ప్లెబిసైట్ నిర్వహించి భారత్‌లోనే విలీనం చేశారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా మూడంటే మూడే రెఫరెండంలు జరిగినట్టుగా ఆధారాలున్నాయి. 1954లో పాండిచ్చేరిలో రెఫరెండం నిర్వహించిన తర్వాతే భారత్‌లో విలీనం చేశారు. అలాగే, 1967లో గోవాలో మరో రెఫరెండం జరిగింది. పోర్చుగీసు పాలకులు గోవానుంచి వెళ్లిపోదలచుకున్న తర్వాత… మహారాష్ట్రలో కలుస్తారా? లేదా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటారా? అనే అంశంపై రెఫరెండం జరిగింది. గోవా వాసులు అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడానికే ఇష్టపడ్డారు. ఆ తర్వాత 1975లో అప్పటిదాకా చిన్న రాజరిక వ్యవస్థగా ఉన్న సిక్కింకూడా రాజరికాన్ని రద్దుచేసుకుని రెఫరెండం ద్వారా భారత్‌లో విలీనం అయింది.
ఎంతో కీలకమైన ఇలాంటి విషయాల్లో తప్ప.. మరెన్నడూ భారత్‌లో రెఫరెండం అనేది జరగలేదు. జమ్మూకాశ్మీర్‌లో రెఫరెండం గురించి చాలాసార్లు చర్చలు జరిగాయి గానీ.. దాన్ని నిర్వహించడానికి భారత పాలకులు ఎన్నడూ సుముఖంగా లేరు.
అమరావతి విషయంలో జరుగుతుందా?
భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఆరు సందర్భాల్లో రెఫరెండంలు ఎప్పుడెప్పుడు జరిగాయో మనకు అర్థమౌతుంది. మొత్తం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో మాత్రమే రెఫరెండంలు జరిగాయి. అలాంటిది… అమరావతినుంచి రాజధానిని వికేంద్రీకరించి మూడు ప్రాంతాలకు మార్చడంపై జరుగుతుందని అనుకోవడం భ్రమ.
ఈ రెఫరెండం అనేది జరిగే పని కాదు అని.. డిమాండ్ చేస్తున్న అన్ని పార్టీల్లోని నాయకులు అందరికీ తెలుసు. కానీ.. ఎవరి రాజకీయ ప్రయోజనాల్ని వారు దృష్టిలో పెట్టుకుని ప్రజల కంటితుడుపు కోసం అన్నట్టుగా రెఫరెండం మాట తెస్తున్నారు.
ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో కేవలం న్యాయపోరాటం ద్వారా మాత్రమే దీనిని అడ్డుకోగలిగే వీలుంటుంది. న్యాయపోరాటం కొనసాగిస్తాం అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. న్యాయపోరాటం తప్ప వేరే గత్యంతరం లేదని పవన్ కల్యాణ్ కూడా ఒప్పుకుంటున్నారు. పోరాటాలు కొనసాగిస్తాం అని భాజపా సన్నాయి నొక్కులు నొక్కుతోంది గానీ.. వారి మాటల్లో సీరియస్‌నెస్ లేదు. జనసేనకు పార్టనర్ అయినప్పటికీ.. వారు న్యాయపోరాటాల ఊసెత్తడం లేదు. ఇలా విపక్ష పార్టీల, రాజకీయ నాయకుల బహుముఖమైన వంచనలు, అధికారపార్టీ దూకుడు మధ్య రాజధాని తరలింపు, వికేంద్రీకరణ నిరాటంకంగా జరిగిపోనుంది.