తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్.. ఈ ఏడాదికే అతిపెద్దదిగా చెప్పుకోదగిన గొప్ప జోక్ కట్ చేశారు. ఈ జోక్ వింటే.. రాష్ట్ర ప్రజలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవడం మాత్రమే కాదు.. పొగిలిపొగిలి ఏడుస్తారు కూడా.
కరోనా సోకిన వారికి పూర్తి చికిత్స అందించడానికి రూ.10వేలకంటె ఎక్కువ ఖర్చు కాదని మంత్రి ఈటల రాజేందర్ సెలవిచ్చారు. అయితే ఇప్పటిదాకా కరోనాతో ఆస్పత్రికి వెళ్తే 10నుంచి 20 లక్షల దాకా బిల్లులు చెల్లించి, ఆర్థికంగా శిథిలమైపోయిన అభాగ్యులు చెబుతున్న దుఃఖమయమైన అనుభవాలన్నీ అబద్ధాలేనా? లేదా, అలాంటి వ్యథలేవీ మంత్రి గారి చెవులకు ఇప్పటిదాకా చేరనేలేదా? అనేది ప్రశ్నార్థకం.
తెలంగాణ వ్యాప్తంగా కూడా కరోనా విపరీతంగా ప్రబలుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో గరిష్టం.. హైదరాబాదులోనే లెక్కతేలుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బెడ్స్ దొరికిన వారు లక్షల్లో బిల్లులు చెల్లించలేక అంతకుమించిన అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా చికిత్సకు 10వేలకు మించి అయ్యే అవకాశమే లేదంటూ సాక్షాత్తూ మంత్రి ప్రకటించడం జోక్ కాక మరేంటి?
తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. కరోనా చికిత్సలను ప్రెవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుమతించిన తర్వాత.. స్పష్టంగా ధరలను నిర్దేశించింది. కానీ.. ఎక్కడా ఆ ధరలు అమలు కావడం లేదన్నది నిజం. కరోనా మాత్రమే కాదు కదా.. ఇతర ఎమర్జెన్సీ అవసరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా.. కరోనా సీజన్ భారీ ధరలతో నానా అగచాట్లు పడుతున్నారు. మంత్రి మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ప్రెవేటు ఆస్పత్రుల్లో పదివేలకు మించి చికిత్సకు ఖర్చు కాదు అని చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా ఉంది.
==
ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలి.
‘‘చిత్తూరు జిల్లాకు చెందిన సత్య (పేరు మార్చడం జరిగింది) నాలుగు నెలల కిందట హైదరాబాదు గచ్చిబౌలీలోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. రెండునెలల అబ్జర్వేషన్ తర్వాత.. సొంత ఊరికి వెళ్లిపోయారు. పదిరోజుల కిందట సమస్య తిరగబెట్టింది. ఆయాసం కూడా వస్తుండడంతో స్థానికంగా తిరుపతిలో ఉన్న ఆస్పత్రుల వారెవ్వరూ కోవిడ్ భయంతో చేర్చుకోనేలేదు. స్విమ్స్ లో కోవిడ్ పరీక్ష చేయించుకుంటే రిపోర్టు రావడానికి పదిరోజులకు పైగా పట్టింది. రిపోర్టు నెగటివ్ వచ్చింది. ఆ నెగటివ్ రిపోర్టు చూపినా.. ఏ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. సర్జరీ చేసిన గచ్చిబౌలి ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద వచ్చారు. అర్ధరాత్రి వేళకు చేరుకున్నారు.
మరునాడు ఉదయం డాక్టరు వచ్చే దాకా ఎమర్జన్సీలో ఎడ్మిట్ కావడానికి ఆ ఒక్క రాత్రికోసం 60 వేల రూాపాయలు కడితే తప్ప చేర్చుకోం అని తేల్చి చెప్పారు. అంత తాహతు లేక.. వారు రాత్రంతా కారులోనే ఉండి ఉదయం తొమ్మిది గంటలకు ఐసీయూలో ఎడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఉన్నందుకు రోజుకు నలభైవేల రూపాయల వంతున బిల్లవుతోంది. రోగికి కరోనా కాకపోయినప్పటికీ.. కరోనా సీజన్లో పెరిగిన ధరలే ఇతర రోగులకూ నడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు బిల్లు చెల్లించడానికి ఊర్లో ఉన్న తమ ఆస్తులు బేరం పెడుతున్నారు.
==
మంత్రి ఈటలగారికి ఇలాంటి ఉదాహరణలు కళ్లెదుట కనిపించకపోవచ్చు. ఆయన ఎంచక్కా.. కరోనా విషయంలో రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి.. పదివేలకు మించి ఈ చికిత్సకు ఖర్చు కాదని జోకులు పేల్చేసి వెళ్లిపోతోంటే.. ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.