ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల బాధ్యతలు అప్పగించే విషయంలో ఈసారి టీచర్లను దూరంపెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించి తమకు అనుకూలంగా పరిస్థితులు మలచుకోవాలనుకుంది. కానీ, ప్రభుత్వ ఎత్తుగడలు చిత్తు కాబోతున్నాయి. టీచర్లకు ఎన్నికల బాధ్యతలు ఇస్తే బోధనపై సరిగ్గా ఫోకస్ చేయలేరనే వాదన ప్రభుత్వం చేసింది. కానీ, ఈసీ జోక్యంతో ప్రభుత్వ ఈ దురాలోచన అమలయ్యేలా కనిపించట్లేదు.
తమకు వ్యతిరేకంగా మారిన ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో నుంచి తప్పిస్తే మేలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వీరిని దూరం పెట్టేలా పావులను గతేడాది నుంచి కదుపుతూ వస్తోంది. గతేడాది నవంబర్ 29న విద్యా హక్కు చట్టంలోని కీలక నిబంధనలకు సవరణలు చేసింది. టీచర్లకు బోధనేతర పనులను అప్పగించకూడదని జీవో కూడా ఇచ్చింది. కానీ, టీచర్లకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టంగా మాత్రం అందులో లేనప్పటికీ, ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం పన్నుతున్న కుట్ర అని అందరికీ తెలిసిపోయింది.
జగన్ సర్కార్‌పై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని, ఇంకా ఎన్నో హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వారికి ఏమీ చేయలేదు. పైగా వారి ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టారు. జీపీఎస్ అంటూ ఇష్టంలేని దాన్ని తెరపైకి తెచ్చారు. అదీకాక టైంకి జీతాలు కూడా సరిగ్గా పడడం లేదు. ఇలా ఉపాధ్యాయుల సమస్యలు గట్టిగా ప్రశ్నించిన వారికి షోకాజ్ నోటీసులు పంపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయం గమనించి ఎప్పట్లాగే టీచర్లు ఎన్నికల విధుల్లోకి వస్తే తమకు అనుకూల ఓట్లు వేయించుకోవడం కుదరదని వారిని దూరం పెట్టాలనే భావనకు వచ్చారు. వారి స్థానంలో జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎన్నికలకు వాడుకోవాలని ప్లాన్ వేశారు.
ఈ ప్లాన్ పై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. అన్ని జిల్లాల్లోని అన్నిశాఖల అధికారులతోపాటు విద్యాశాఖాధికారులు, టీచర్ల వివరాలు కేటగిరీల వారీగా పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 2024 లో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్ అధికారులుగా డ్యూటీల్లోకి తీసుకోవాలని, ఆ లిస్టును రెడీ చేయాలని కలెక్టర్లు, డీఈవోలు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలినట్లు అయింది.











