విజయనగరం జిల్లా కార్మికులు, సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా ఈఎస్ఐ సౌలభ్యం ఉన్న వ్యక్తులు మెరుగైన వైద్యం కోసం తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని విశాఖకు దశాబ్దాలగా పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కష్టాలు తీరాయని స్థానికులు అనుకున్నారు. జిల్లా అభివృద్ధిలోనూ కీలకమైన ఈ ఆసుపత్రిని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) క్యాంపస్ కొండపై నిర్మించాలని పునాది వేసి ఏడాది గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభం కాని పనులు
ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. విజయనగరం పరిధిలోని గాజులరేగ ప్రాంతానికి చెందిన ఏయూ ప్రాంగణ సమీపంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయి. విజయనగరంలో అయిదు ఎకరాల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని రూ.75.26 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. వాస్తవానికి పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అప్పటి విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దీన్ని తీసుకురావాలని భావించారు. ఎన్‌సీఎస్ థియేటర్ సమీపంలో స్థలాన్ని చూడటం, దాన్ని ఆమోదించడం అంతా చకచకా జరిగిపోయాయి. తీరా ఆ స్థలంపై న్యాయస్థానంలో కేసు ఉండటంతో మరొక చోట నిర్మిద్దామనుకున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో ప్రతిపాదన దశలోనే అది నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి కదలిక వచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పని తిప్పలు
గతేడాది డిసెంబరు 19న ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.జయరాం మాట్లాడుతూ ‘విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో 1150 కర్మాగారాలు ఉన్నాయి. 1.5 లక్షల మంది కార్మికులున్నారు. వీరంతా వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక విజయనగరంలోనే మరుగైన సేవలు అందుతాయి’ అన్నారు. మంత్రి మాటలు కార్యరూపం దాల్చకపోవడంతో విజయనగరం వాసులకు తిప్పలు తప్పడం లేదు.
జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు తక్షణమే కల్పించుకుని ఈ ఆసుపత్రి పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.











