Enforcement Directorate Arrested Kelvin The Key Accused In The Tollywood Drugs Case :
తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ప్రముఖుల మెడకు చుట్టుకున్న డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, చార్మీలను ప్రశ్నించిన ఈడీ.. మంగళవారం నాడు యువ నటుడు నందూను విచారిస్తున్నారు. ఓ వైపు నందూ విచారణ జరుగుతున్న సమయంలోనే టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని, ఈ కేసులో కీలక నిందితుడని భావిస్తున్న విదేశీయుడు కెల్విన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గట్టి బందోబస్తు మధ్య అతడిని తమ కార్యాలయానికి తరలించిన ఈడీ అధికారులు.. అతడిని నందూ ముందు కూర్చోబెట్టి మరిన్ని వివరాలు రాబట్టే యత్నం చేస్తున్నారు. కెల్విన్ అరెస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖుల్లో పెను కలవరాన్ని రేపిందనే చెప్పాలి.
కెల్విన్ మొబైలే పట్టించింది
అసలు డ్రగ్స్ కేసు కెల్విన్ సెల్ ఫోన్ లోని నెంబర్ల ఆధారంగానే మొదలైందని చెప్పాలి. అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నారంటూ కొందరిని పట్టుకోగా.. వారి విచారణలో కెల్విన్ పేరు బయటకు రావడం, అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించడం, ఈ సందర్భంగా అతడి మొబైల్ లో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉండటంతో నాడు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అకున్ సభర్వాల్ ఈ కేసు కూపీ మొత్తం లాగేశారు. అంటే.. కెల్విన్ పట్టుబడటంతోనే టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో ఇరుక్కున్నారన్న మాట. అంటే.. ఇప్పుడు కెల్విన్ అరెస్టయ్యాడంటే.. ఈ కేసులో ఇరుక్కున్న వారికి కూడా మూడినట్టే కదా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మరో ఇద్దరి అరెస్ట్
ఈ కేసులో కెల్విన్ తో పాటు పాతబస్తీకి చెందిన కుదూస్, వాహిద్ లను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ కెల్విన్ కు అనుచరులుగా వ్యవహరించినట్టుగా సమాచారం. కెల్విన్ ను అరెస్ట్ చేసిన సమయంలో అతడి ఇంటిలో నుంచి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు, కొంత మేర నగదును కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కుదూస్, వాహిద్ అరెస్ట్ సందర్భంగానూ వారి ఇళ్ల నుంచి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం హీరో దగ్గుబాటి రానా, ఆ మరునాడు మరో టాప్ హీరో రవితేజలు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇద్దరు టాప్ హీరోలు విచారణకు హాజరయ్యే ముందుగా ఈడీ అధికారులు కెల్విన్ తో పాటు అతడి అనుచరులను అరెస్ట్ చేయడం కలకలమే రేపుతోంది.
Must Read ;- ‘డ్రగ్స్’ స్టార్లను కెల్విన్ ముంచేశాడు











