టాలీవుడ్ డ్రగ్స్ కేసును తెరపైకి తీసుకు రావడంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అన్న ఆలోచన ఇప్పుడు చాలా మందిలో వచ్చింది. దాదాపు నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసును అప్పుడప్పుడూ తెరపైకి తీసుకొస్తూనే ఉన్నారు. ఒక విధంగా ఆయా నటులకు ఇది మానసిక క్షోభ కలిగించే అంశం. నిజంగా ఈ కేసు విషయంలో దర్యాప్తు అధికారులకు చిత్తశుద్ది ఉంటే ఇంత కాలయాపన జరిగేది కాదన్నది జగమెరిగిన సత్యం. కేసు దర్యాప్తు నాలుగేళ్లుగా కొనసాగడమేమిటన్నది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.
అటు బాలీవుడ్, శాండల్ వుడ్, ఇటు టాలీవుడ్.. అన్ని ఉడ్ లలోనూ ఏదీ తేలని వ్యవహారమే. విదేశాల నుంచి ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పట్లో పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ , రానా దగ్గుబాటి, రవితేజ, నవదీప్, ఎఫ్‌క్లబ్‌జీఎం, ముమైత్ ఖాన్, తనీష్ లాంటి సినీ ప్రముఖులను విచారించడం సంచలనం కలిగించింది. సిన్సియర్ అధికారిగా పేరున్న అకున్ సబర్వాల్ దర్యాప్తు తీరును కూడా ఎవరూ శంకించలేదు.
ఈ కేసులో కెల్విన్ అనే వ్యక్తిని అప్పట్లో అరెస్టు చేశారు. అతనికి అమెరికాలోని షికాగోలో ఉన్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ డ్రగ్స్ అన్నీ అక్కడి నుంచే దిగుమతి అవుతున్నట్లు కెల్విన్ వెల్లడించాడు. మళ్లీ ఈ వ్యవహారాన్ని ఈడీ తెరపైకి తెచ్చింది. అసలు డ్రగ్స్ కోసం ఎంత డబ్బు విదేశాలకు తరలుతోంది? ఎవరెవరికి దీంతో సంబంధాలున్నాయి? అన్న విషయాలను మళ్లీ ఆరాతీస్తున్నారు. ఈ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో బిట్ కాయిన్ కీలకంగా ఉందన్న సమాచారం ఈడీ వద్ద ఉంది.
ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులను నమోదు చేశారు. మొత్తం 11 ఛార్జి షీట్లను కోర్టులో దాఖలు చేశారు. అప్పుడు విచారణకు హాజరైన ప్రతి ఒక్కరినీ మళ్లీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ విచారణ జరగనుంది. లిస్టులో మొదటి పేరు దర్శకుడు పూరి జగన్నాథ్ ది ఉంది.ఎవరెవరిని ఎప్పుడు విచారించనున్నారో ఆ వివరాలు చూద్దాం.
పూరి జగన్నాథ్ (ఆగస్టు 31), ఛార్మి (సెప్టెంబర్ 2), రకుల్ ప్రీత్ సింగ్ (సెప్టెంబర్ 6), రానా దగ్గుబాటి (సెప్టెంబర్ 8), రవితేజ (సెప్టెంబర్ 9), శ్రీనివాస్ (సెప్టెంబర్ 9), నవదీప్ (సెప్టెంబర్ 13), ఎఫ్‌క్లబ్ జీఎం (సెప్టెంబర్ 13), ముమైత్ ఖాన్ (సెప్టెంబర్ 15), తనీష్ (సెప్టెంబర్ 17), నందు (సెప్టెంబర్ 20), తరుణ్ (సెప్టెంబర్ 22).. ఈ తేదీలతో వీరికి తాఖీదులు వెళ్లాయి.
తమకు ఎలాంటి నోటీసులూ అందలేదని కొందరు అంటున్నారు. కన్నడ కథానాయికలు సంజనా, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు అందినట్లు సమాచారం. వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కూడా వచ్చింది. ప్రస్తుతం వీరు బెయిల్ మీద ఉన్నారు. మళ్లీ వీరికి విచారణ తప్పదన్న మాట. మరి ఈసారి దరాప్తు తీరు ఎలా ఉండబోతుందో చూడాలి.
Must Read ;- ఈడీకే నకిలీ మకిలీ అంటించేశారే











