Enforcement Directorate Notices To 10 Celebrities In Tollywood Drugs Case :
తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్తు తెలుగు నేలలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మరోమారు ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ కేసును సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి వెలికి తీసింది. డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంగా విచారణలో నిందితులు వెల్లడించిన సమాచారంతో పోలీసులు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులను విచారణకు పిలిచిన వైనం కూడా నాడు సంచలనం రేపింది. 2017లో జరిగిన ఈ పరిణామాలు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేశాయనే చెప్పాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని అకున్ సభర్వాల్ నిందితుల నుంచి వెలువడిన సినీ ప్రముఖులందరినీ విచారణకు రప్పించిన వైనం నాడు కలకలం రేపింది.
ఒక్కసారిగా తెర మరుగు
అయితే ఈ డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులటతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖ నేతల పిల్లలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారని, వారి పేర్లను కూడా వెల్లడించాలని, వారిపైనా కేసులు నమోదు చేసి విచారించాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అకున్ సభర్వాల్ ను ఔషధ నియంత్రణ మండలి నుంచి తప్పిస్తారన్న వార్తలూ వినిపించాయి. అయితే అకున్ ను అదే పోస్టులో కొనసాగించిన తెలంగాణ సర్కారు.. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విచారణకు హాజరైన పలువురు ప్రముఖులకు ఈ దందాతో సంబంధం లేదని సిట్ తేల్చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ కేసు అటకెక్కేసింది. తదనంతరం ఈ కేసును వెలికితీసిన అకున్ సభర్వాల్ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఫలితంగా ఈ కేసు ఇక మూతపడినట్టేనన్న వాదనలు వినిపించాయి.
సింగిల్ ఫిర్యాదుతో రంగంలోకి ఈడీ
ఇదిలా ఉంటే.. ఈ కేసులోని అసలు నిజాలను బయటపెట్టాలని ఆది నుంచి ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ వేయడంతో పాటుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకున్న ఈడీ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ ఏకంగా 10 మంది సినీ ప్రముఖులకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసిన వారిలో చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, రానా, రవితేజ, తరుణ్, నందు, శ్రీనివాస్ తదితరులున్నారు. ఈ నెల 31న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. వీరి విచారణను ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు నాన్ స్టాప్ గా కొనసాగించేందుకు ఈడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అంటే.. ఏకంగా 23 రోజుల పాటు సినీ స్టార్ల విచారణ జరగనుందన్న మాట. ఈడీ నోటీసులతో మరోమారు డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Must Read ;- చిరంజీవి తర్వాత మెగాస్టార్ అంటే.. అల్లు అర్జునే. వైరల్ గా మారి వర్మ ట్వీట్.











