అదే పిచ్.. అదే టీం… కానీ ఫలితం మాత్రం తారుమారైంది! టెస్టుల్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియా అనుకోకుండా బోల్తా పడింది. అదే ఇంగ్లాండ్ పై మరిచిపోలేని పరాజయాన్ని మూట కట్టుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లిష్ జట్టు… భారత్‌ను అతి తక్కువ పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఆది నుంచే తడబడుతూ..
తొలి టీ20లో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ మాత్రమే 67 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్(1), విరాట్ కోహ్లీ(0) వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. ఆ వెంటనే శిఖర్ ధావన్(4) వెనుదిరిగారు. పంత్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ నిలుదొక్కుకునే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా పంత్(21) ఔటయ్యారు. పాండ్యాతో కలిసి శ్రేయస్ అయ్యర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వెంటనే వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్ 3 వికెట్లు, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు.
గుర్తుండిపోయే విజయం..
ఇంగ్లాండ్ జట్టు ఆది నుంచే ఆదిపత్యాన్ని కొనసాగించింది. ఓపెనర్ జేసన్ రాయ్ (49) అర్ధశతకం సాధించే క్రమంలో సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగారు. అంతకుముందు బట్లర్(28) చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన డేవిడ్ మలన్(24), జానీ బెయిర్ స్టో(26) నిలకడగా ఆడుతూ.. ఇంగ్లిష్ జట్టుకు గుర్తుండిపోయే విజయాన్ని కట్టబెట్టారు. ఫలితంగా ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనపై ఘన విజయం సాధించింది.
Must Read ;- టీమిండియా క్రికెటర్ బుమ్రా పెళ్లి.. వధువు విషయం సీక్రెట్!










