ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. కళ్లు చెదిరే షాట్లతో మైమరచిపోవాలనే కోరిక చెదిరిపోయింది. ఐదురోజులు స్టార్ క్రికెటర్ల విన్యాసాలు చూడాలని భావించగా.. రెండు రోజుల్లోనే ఆట ముగిసిపోయింది. నరేంద్ర మోడీ మైదానంలో స్పిన్ మాయాజాలం కనిపించింది. స్పిన్నర్ల దాటికి బ్యాట్స్ మెన్లది ప్రేక్షకపాత్రేనేమో అనిపించింది. అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన పింక్ బాల్ టెస్టుకు ఐదు సెషన్లలోనే ముగింపు పలికింది. చివరికి.. ఇంగ్లాండ్ జట్టుపై భారత్ గుర్తుండి పోయే విజయాన్ని సొంతం చేసుకుంది.
భారత్ జయభేరి..
అహ్మదాబాద్ పింక్ టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది.10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది కోహ్లీ సేన. స్పిన్‌కు సహకరించే మైదానాన్ని టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.
వికెట్లేమీ కోల్పోకుండానే..
రెండో ఇన్నింగ్స్‌లో49 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. వికెట్లేమీ కోల్పోకుండా విజయం సాధించింది. రోహిత్ శర్మ 25, గిల్ 15 పరుగులు సాధించారు. ఓవర్నైట్ స్కోర్ 99/3తో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 5 వికెట్లతో మెరవగా.. లీచ్ 4 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కంటే 33 పరుగులు ఎక్కువ చేసింది.
అడుగడుగునా తడబాట్లు..
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్.. పూర్తిగా తడబాటుకు గురైంది. కేవలం 30.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు. గులాబీ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ బ్యాటింగ్ ఆరంభించి మూడు వికెట్లు కోల్పోయింది. రెండోరోజు టీమ్ఇండియా మిగతా 7 వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఇరు జట్లవి రెండు ఇన్నింగ్స్ సాగడం గమనార్హం.
400 క్లబ్‌లో అశ్విన్.. ధోనీని దాటిన విరాట్..
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇందుకు అశ్విన్ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ 72 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(22) రికార్డు సృష్టించారు. ధోనీ (21) అతని తర్వాతి స్థానంలో ఉన్నారు.
Must Read ;- చెపాక్ పిచ్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..











