కోవిడ్ -19 బారిన పడిన రోగులు శ్వాస తీసుకోడానికి కష్టపడుతున్న రోజులివి. మెడికల్ ఆక్సిజన్ కోసం జనం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ బారిన పడిన 45 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆపద్భాంధవిగా కనిపిస్తోంది ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’.
వైజాగ్ లోని గీతం హాస్పిటల్ కి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చి చేరాయంటే అది ఈ సంస్థ చలవే. ఇలాంటి కేంద్రాలు ఏపీలో మరో ఐదింటిని ఈ సంస్థే ఏర్పాటుచేసింది. వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’ ఈ బృహత్కార్యాన్ని తలపెట్టింది. ఇంతకీ ఏమిటీ సంస్థ? కోవిడ్ బాధితులకు ఎలాంటి చేయూతను ఇస్తోంది? అనే విషయాలను తెలుసుకుందాం. ఇది ఏపీలోని యువ పారిశ్రామిక వేత్తల మదిలో పుట్టిన ఆలోచన. ఆక్సిజన్ కొరతతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూసి చలించిపోయి ఏదో ఒకటి చేసి ఆ జీవితాలకు అండగా నిలవాలని ఆ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఏపీలోని ఆ సంస్థ సభ్యులంతా చర్చించుకుని ఓ కొత్త ఆలోచనకు పునాది వేశారు. అలా ఏర్పడిందే ఈ సంస్థ.
అసలేమిటి ఈ సంస్థ?
ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లో ఎంటర్ ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ (ఇవో) ఉంది. దాదాపు 15000 పైచిలుకు సభ్యులు ఇందులో ఉన్నారు. తమ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవడం, పరస్పర సహకారం అందించుకోవడం తదితర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడిన సంస్థ ఇది. 1987 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థలో 2018 నుంచి ఏపీ నుంచి 26 మంది యువ పారిశ్రామిక వేత్తలు ఇందులో భాగమయ్యారు.
ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్న వార్తలు గత ఏప్రిల్ లో ఈ సంస్థ సభ్యుల దృష్టికి వచ్చాయి. రామ్మోహన్ నాయుడు కింజరపు, దివ్య నల్లమోతు, స్మిత వల్లూరుపల్లి, విధాన్ మిట్టల్, రవి మూల్పూరి, రాజీవ్ సెన్నార్, రాజీవ్ బొల్లా, శ్రీహర్ష వడ్లమూడి తదితరులు విరాళాలు ఇచ్చి దాదాపు మూడు కోట్ల రూపాయలను సమీకరించారు. ఈ నిధులతోనే ఈ ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
వీరిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని సంకల్పించారు. తమ వంతుగా తలా కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి నిధులు సమకూర్చుకుని కోవిడ్ బాధితుల సేవకు నడుంబిగించారు. మొత్తం ఆరు కేంద్రాలను ఏర్పాటుచేసి సేవలు అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి ఏమేం సౌకర్యాలు అవసరమో వాటిని ఏర్పాటుచేశారు. ఈ మెడికల్ ఆక్సిజన్ సమీకరణకు మూడున్నర కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించి ఆ దిశగా అడుగులు వేశారు.
ఇప్పటిదాకా ఏమేం చేశారు?
ఎంటర్ ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా ఆరు కేంద్రాలను ఏర్పాటుచేసి ఆక్సిజన్ సరఫరా తదితర సేవలను అందిస్తోంది. మొదటి దశలో అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లో ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రాలలో ప్రతి దానిలోనూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్, బీపీ యంత్రాలు, మెడిసిన్స్ వంటిలాంటి ప్రాథమిక వైద్య అవసరాలతో కూడిన పడకలు కూడా ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలోనూ హెల్త్ కేర్ టీమ్స్,భద్రతా సిబ్బంది ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే ఈ కేంద్రాల్లో ఆహారం, నీరు, వాష్ రూమ్‌ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉంటాయి.
అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, శ్రీకాకుళంలో రిమ్స్ గవర్నమెంట్ హాస్పటల్, టెక్కలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఆక్సిజన్ బ్యాంకు, ఆక్సిజన్ సెంటర్ కూడా ఏర్పాటుచేశారు, విజయవాడలో ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేశారు, విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రానికి 50 చొప్పున ఆక్సిజన్ కాన్ సెన్ ట్రేటర్ల,ను, ఆక్సిజన్ సిలెండర్లను ఇప్పటిదాకా సరఫరా చేశారు. ఏలూరులో జాయింట్ కలెక్టర్ల హిమాంశు శుక్లాకు 45 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందజేశారు. ఇకముందు కూడా అవసరమైన వాటిని ఏర్పాటుచేస్తామని ఈ సంస్థ సభ్యులు అంటున్నారు.
ఈ కేంద్రాల నుంచి సమీప ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లను పంపించే ఏర్పాటుచేశారు. అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరతతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించే ఏర్పాటుచేశారు. ఈ యువ పారిశ్రామిక వేత్తలు చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ తరహాలో సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. కోవిడ్ బాధితులకు ఎవరైనా సహాయ సహకారాలు అందించదలుచుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయవచ్చు. నిధుల సమీకరణకు మీ వంతు సహకారాన్ని కూడా అందించవ్చు. https://fundraisers.giveindia.org/…/help-andhra-and… ని చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి.