నాలుగు మెతుకులు కతకాలంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనేది వెనకటికో సామెత. అంటే పొదుపు ఎంత అవసరమో ఈ సామెత ద్వారానే చెప్పారు. మనం చెప్పబోయేది ఆ నాలుగు రాళ్ల గురించి కాదు. ఈ రాళ్లు నాలుగు వెనకేసుకుంటే మనం లక్షాధికారులం ఇట్టే అయిపోవచ్చు. ఆ నాలుగు రాళ్ల కథేంటో చూద్దాం. మనం ఆకాశంలో ఉల్కల్ని చూస్తుంటాం. అవి ఒక్కోసారి కిందపడుతుంటాయి. కొన్ని కిందపడేసరికి మండిపోతాయి… మరికొన్ని రాళ్ల రూపంలో పడుతుంటాయి. నిజానికివి గ్రహశకలాలు.
వీటికి అంత డిమాండు ఎందుకనేగా మీ ప్రశ్న. వీటికి అంత ధర పలుకుతోంది మరి. 40 కిలోల రాయి ఖరీదు రూ. 19 లక్షలకు పైగా పలుకుతోంది. మరి కొన్ని దేశాల్లో అయితే వీటి ధర కోట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ రాళ్లు ఈ ఆగస్టులో ఓ ఊరి దిశ, దశలను మార్చేశాయి. బ్రెజిల్ లోని శాంతా ఫిలోమెనా అనే గ్రామం దశ ఇప్పుడు మారిపోయింది. గత నెల ఆగస్టు 19వ తేదీన ఆకాశం నుంచి కొన్ని రాళ్లు ఆ ఊరిలో వచ్చిపడ్డాయి. ఆ ఊరంతా ఉన్నది రైతులే. తమ పొలాల్లో రాళ్లు కనిపించేసరికి వాటిని ఏరుకుని ఇంటికి తెచ్చుకున్నారు.
ఎందుకన్నా మంచిదని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత వాటి ధర తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్కోరాయి ఖరీదు 19 లక్షలుంటుందని ఖగోళ పరిశోధకులు ప్రకటించారు. దాంతో రాళ్ల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. గ్రహశకలాలు మన ఊరిలో పడవద్దని ఎవరైనా కోరుకుంటారు… ఇప్పుడు మాత్రం మన ఊరిలోనే పడాలని జనం కోరుకుంటారేమో. ఆ రాళ్లు 460 కోట్ల సంవత్సరాల క్రితం నాటివట. ఆకాశం నుంచి ఇలాంటి రాళ్ల వర్షం పడితే ఎంత బాగుండు అని కూడా అనిపిస్తోంది కదూ. ఇలాంటి రాళ్లను చూస్తే కొత్త సామెతలు కూడా పుట్టుకు రావచ్చు.
పళ్లూడ గొట్టడానికి ఏ రాయి అయినా ఒకటే అనే సామెతకు బదులు లక్షాధికారి కావడానికి ఏ రాయి అయితేనేం అనేలా సామెతలు పుట్టించేస్తారేమో. ఇంతకీ అందులో ఉన్న ఖనిజం ఏమిటో? దాని కమామీషు ఏమిటో ఇంకా తెలియలేదు. డబ్బు చెట్లకు కాస్తుందా అంటారుగాని ఇప్పుడు ఆకాశానికి కూడా డబ్బు కాస్తుందని అనుకోవచ్చు.











