టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి..సీఐడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సాక్షి పత్రిక వారే తన చేత ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయించి, ఏం మాట్లాడాలో సబ్జెక్టు కూడా చెప్పేవారని విచారణలో చెప్పారు. ఐతే సాక్షి ప్రతినిధులు ఇచ్చిన విషయాలు నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని పోసాని చెప్పినట్లు సమాచారం.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ తదితరులపై సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబరు 9న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు CID పోలీసులు గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. సీఐడీ అధికారులు 32 ప్రశ్నలు అడగగా..కొన్నింటికి స్పష్టమైన సమాధానలు ఇచ్చిన పోసాని..మరికొన్నింటికి తెలియదని, గుర్తు లేదని చెప్పినట్లు సమాచారం.
పోసాని అడిగిన ప్రశ్నలు – సమాధానాలు –
పోలీసులు: ప్రెస్‌మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు? సబ్జెక్టు ఎలా షేర్ చేసేవారు?
పోసాని: సాక్షి పత్రిక వాళ్లే చెప్పేవారు. వారి పేర్లు తెలియదు. ముందుగానే సమాచారం చెప్పేవారు. వాళ్లు రాసిచ్చిందే నేను మాట్లాడేవాడిని.
పోలీసులు: ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారు?
పోసాని: కొన్ని సందర్భాల్లో ఓ గంట, రెండు గంటల ముందు చెప్పేవారు. అది ఫాలో అయి మాట్లాడేవాణ్ని.
పోలీసులు: చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పేవారు?
పోసాని: ఈ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు. నన్ను, నా కుటుంబాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు తిట్టడంతో నా అంతట నేనే స్పందించేవాణ్ని.
పోలీసులు:సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టు రాసి ఇస్తే.. చదివానని గతంలో చెప్పారు కదా?
పోసాని: ప్రెస్‌మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసివ్వలేదు.
పోలీసులు: చంద్రబాబు మోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని మీరు ఎక్కడ చూశారు? అందుకు సంబంధించిన వీడియోలున్నాయా?
పోసాని: నేను విలేకర్ల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు, చిత్రాలు అన్నీ సాక్షి వాళ్లే ఇచ్చారు. నా దగ్గర ఎలాంటి వీడియోలు లేవు.
పోలీసులు: ప్రెస్‌తో మాట్లాడే ముందు నిర్ధారణ చేసుకోవాలి కదా? ఎందుకు చేయలేదు?
పోసాని: నిర్ధారించుకోకుండానే వీడియోలు, ఫొటోలు చూపించాను. సాక్షివాళ్లు ఇచ్చారు కదా అని నిర్ధారించుకోలేదు.