మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు రోజా చుట్టూ వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినంత సులభంగా రోజా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో అధికారంలో ఉండగా రోజుకొక వైరల్ వీడియో అయినా వైరల్ అయ్యేది. ఎన్నో విమర్శల పాలయ్యేవారు. అధికారం కోల్పోయాక కూడా ఆమె తన తీరు మార్చుకోలేదు. పైగా ఇప్పుడు మరింత తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా పవిత్రమైన స్వామివారి సన్నిధిలో ఆమె ఇలా వ్యవహరించడం చాలా పెద్ద విమర్శలకు తావిస్తోంది.
రోజా తమ ప్రాంతంలో ఉన్న ఆలయానికి వచ్చిందని అక్కడ పని చేసే ఉద్యోగులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అలా సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు సైగ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నాడు వరుషాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో రోజా తన భర్త సెల్వమణితో పాటు పాల్గొన్నారు. అనంతరం ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఆలయం నుంచి వెలుపలకు వస్తున్న రోజాను చూసి అవాక్కైన అక్కడున్న చాలామంది ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. వారితో బాగానే సెల్ఫీలు దిగిన ఆమె.. అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లి తామకు కూడా ఫోటో ఛాన్స్ ఇవ్వాలని అడగ్గా… వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపించారు. ఇదంతా వీడియోలో ఉంది. వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది. పారిశుద్ధ్య కార్మికులు రోజాకు దూరంగానే నిలబడి ఫోటో దిగారు.
ఆ తర్వాత వచ్చిన పూజార్లు మాత్రం రోజాకు చాలా దగ్గరగా నిలబడ్డారు. దీంతో రోజా తీరు మరోసారి సెన్సేషన్ అయింది. నెటిజన్లు ఆమె తీరును బాగా విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఆమె అంటరాని వారిగా పరిగణిస్తుండడాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటూ ఫొటోలు దిగిన రోజా.. పారిశుద్ధ్య కార్మికులను మాత్రం దూరం పెట్టడం ఆమెలోని జాత్యాహంకారం, అంటరాని తనాన్ని చాటుతుందని కామెంట్లు చేస్తున్నారు.











